Pemmasani Chandrasekhar: అమరావతికి కేంద్రం భారీ బహుమతి: 2,500 కోట్ల రూపాయల సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్ట్‌కు క్యాబినెట్ ఆమోదం : కేంద్ర ఆరోగ్య, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
కేంద్ర ఆరోగ్య, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
Pemmasani Chandrasekhar: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త అందించిందని కేంద్ర ఆరోగ్య, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకటించారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రి మండలి సమావేశంలో అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఆమోదం తెలిపింది.
ఈ ప్రాజెక్ట్ కింద రూ.2,500 కోట్ల వ్యయంతో 5 ఎకరాల స్థలంలో 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అత్యాధునిక ఆఫీస్ కాంప్లెక్స్ నిర్మాణం జరగనుంది. రెండు భారీ టవర్లలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయబడతాయి. 1,800 కార్ల సామర్థ్యం గల పార్కింగ్ సౌకర్యంతో కూడిన ఈ సముదాయం ఆధునిక సదుపాయాలతో తయారవుతుంది.
అంతేకాకుండా, రూ.1,234 కోట్లతో 17 ఎకరాల్లో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది. ఇందులో 11 టవర్లలో 1,568 నివాస క్వార్టర్లు నిర్మించనున్నారు. గ్రీన్ ఎనర్జీ, కమ్యూనిటీ హాళ్లు, ఆధునిక సౌకర్యాలతో గేటెడ్ కమ్యూనిటీగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయబడుతుంది.
2018లో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టు 2024 తర్వాత వేగంగా అమలులోకి వచ్చిందని మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, ఆర్థిక శాఖల సహకారంతో ఈ ప్రాజెక్టు సాధ్యమైందన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అమరావతి అభివృద్ధి వేగం పుంజుకుంటుందని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ప్రాజెక్టు అమరావతి నగరానికి మరింత ప్రాధాన్యతను అందించి, ఉపాధి అవకాశాలను పెంచుతుందని అంచనా.