Ram Mohan Naidu: గంజాయి, హత్యలే గొడ్డలి పార్టీ అజెండా: రామ్మోహన్ నాయుడు
రామ్మోహన్ నాయుడు
Ram Mohan Naidu: ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ఐదేళ్ల పాలనలో అన్ని తప్పుడు బటన్లు నొక్కారని, చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం ద్వారా అతి పెద్ద తప్పు చేశారని, అందువల్లే ప్రజల ఆగ్రహానికి గురైనారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు తీవ్రంగా విమర్శించారు.
పల్నాడు జిల్లా అమరావతిలో పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ‘100 రోజులు.. వంద గ్రామాలు’ కార్యక్రమం ముగింపు మరియు కూటమి ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభలో ఆదివారం రామ్మోహన్ నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఐదేళ్ల వైకాపా విధ్వంసం నుంచి రాష్ట్రం ఇప్పుడే కోలుకుంటోందని, కూటమి ప్రభుత్వం రెండేళ్లలో అభివృద్ధి పరుగులు తీస్తోందని చెప్పారు.
“మేము చేసిన అభివృద్ధిని పుస్తకాలు వేసి చూపిస్తున్నాం. దీనిపై ఎవరైనా చర్చకు వచ్చినా సిద్ధమే” అని సవాల్ విసిరారు. గొడ్డలి పార్టీకి తెలిసిందల్లా గంజాయి, హత్యలే అని ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. మరో 30 ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండాలని కోరుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని 100 గ్రామాల్లో 100 రోజులు పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్‌ను రామ్మోహన్ నాయుడు అభినందించారు.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, వైకాపా పాలనలో సాగునీరు పారలేదని, జగన్ కల్తీ మద్యాన్ని గ్రామాల్లో పారించారని తీవ్ర విమర్శలు చేశారు. అమరావతిని రాజధానిగా చట్టబద్ధం చేయడానికి మద్దతివ్వని ఏకైక పార్టీ వైకాపా అని గుర్తు చేశారు.
ఈ సభలో పాల్గొన్న నాయకులు కూటమి ప్రభుత్వ సాధించిన విజయాలను వివరించి, వైకాపా పాలనను తీవ్రంగా నిరసించారు.