Potti Sriramulu: రాజధాని అమరావతి పరిధిలోని తుళ్లూరు సమీపంలో అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి అమరత్వం చెందిన పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం జరిగింది.

ఈ విగ్రహాన్ని 'స్టాచ్యూ ఆఫ్ స్యాక్రిఫైస్' (త్యాగ విగ్రహం)గా నామకరణం చేశారు. పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో తుళ్లూరు సమీపంలో 6.8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న స్మృతివనంలో ఈ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రులు నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, టీజీ భరత్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు.

పొట్టి శ్రీరాములు ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు చేసిన త్యాగం దేశ చరిత్రలో అమరమైనదని, ఆయన స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు చాటేందుకు ఈ విగ్రహం, స్మృతివనం ఏర్పాటు చేయడం గౌరవప్రదమని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ విగ్రహావిష్కరణతో పాటు అమరజీవి 125వ జయంతి వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఆర్యవైశ్య సంఘాలు, ట్రస్ట్ సభ్యులు విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమం రాజధాని అమరావతి అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణకు మరో మైలురాయిగా నిలిచింది.

Tags: