Minister Nara Lokesh: సియోల్‌లో పెట్టుబడుల కోసం మంత్రి నారా లోకేశ్ యత్నాలు
మంత్రి నారా లోకేశ్ యత్నాలు
Minister Nara Lokesh: దక్షిణ కొరియాలో ఏపీ మంత్రి నారా లోకేశ్ పర్యటన కొనసాగుతోంది. ఆ దేశ రాజధాని సియోల్‌లో వివిధ సంస్థల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలు, పారిశ్రామిక అనుకూలతలను లోకేశ్ వారికి వివరంగా తెలియజేశారు. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్, ఎలక్ట్రానిక్స్, ఆటోమోటివ్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఈ పర్యటన కొనసాగుతోంది.
తొలుత ఎలక్ట్రానిక్ షెల్ఫ్ లేబుల్స్, ఐఓటీ మరియు పవర్ ఎలక్ట్రానిక్స్ తయారీలో ప్రముఖ సంస్థ అయిన సోలమ్ (SOLUM) గ్రూప్ గ్లోబల్ ఆపరేషన్స్ ఆఫీసర్ జీగాబ్‌తో మంత్రి లోకేశ్ భేటీ అయ్యారు. శ్రీసిటీలో రూ.338 కోట్లతో సోలమ్ సంస్థ ఈవీ ఛార్జర్ పవర్ మాడ్యూల్స్ మరియు ఆటోమోటివ్ ఎలక్ట్రానిక్స్ యూనిట్ నిర్మిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే శ్రీసిటీ యూనిట్ నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తులను ప్రారంభించాలని మంత్రి కోరారు.
ఆ తర్వాత ఎపిటాక్సీ, మైక్రో ఎల్ఈడీ, పవర్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ తయారీ సంస్థ సాఫ్ట్-ఈపీఐ సీఈవో సుంగ్ మిన్ హ్వాంగ్‌తో సమావేశమయ్యారు. భారతీయ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని ఏపీలో మైక్రో ఎల్ఈడీ డిస్‌ప్లే-మెటీరియల్ హబ్ ఏర్పాటు చేయాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
సియోల్ బిజినెస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో కొరియన్ స్టార్టప్ ఫౌండర్లతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి లోకేశ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా "వన్ ఫ్యామిలీ, వన్ ఎంటర్‌ప్రెన్యూర్" నినాదంతో ఐదేళ్లలో 20 వేల స్టార్టప్‌లు, ఒక లక్ష ఉద్యోగాలు సృష్టించాలని లక్ష్యం పెట్టుకున్నట్లు తెలిపారు. భారతదేశ ఏఐ రాజధానిగా ఏపీని తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని పేక్కొన్నారు. కొరియన్ స్టార్టప్‌లను రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లోకి ఆహ్వానించారు.
ఆ తర్వాత హ్యోసంగ్ హెవీ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ పవర్ సిస్టమ్స్ ప్రెసిడెంట్ యోకోటా తకేషితో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని తిరుపతి లేదా శ్రీసిటీ సమీపంలో స్విచ్‌గేర్లు, విద్యుత్ పరికరాల తయారీ మరియు అసెంబ్లింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
చివరగా సియోల్ సెమీ కండక్టర్స్ వైస్ ప్రెసిడెంట్ తాయెహ్యుంగ్ లీతో సమావేశమై, శ్రీసిటీ పరిసర ప్రాంతాల్లో డిస్‌ప్లే ఫ్యాబ్ ఏర్పాటు చేయాలని మంత్రి లోకేశ్ కోరారు.
ఈ భేటీల ద్వారా ఏపీలో అధునాతన సాంకేతిక రంగాల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తున్నారు.