Minister Narayana: అమరావతి వైకాపా కమిటీల పై మంత్రి నారాయణ ఘాటు వ్యాఖ్యలు

మంత్రి నారాయణ ఘాటు వ్యాఖ్యలు

Update: 2026-06-04 11:35 GMT

Minister Narayana: రాజధాని అమరావతిలో ట్రంక్ రోడ్లు, బ్రిడ్జిలు, వాగుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ట్రంక్ రోడ్లపై 43 బ్రిడ్జిలు, ఎల్పీఎస్ జోన్లలో 32 బ్రిడ్జిలు నిర్మాణం జరుపుతున్నట్లు వివరించారు. వర్షాకాలంలో కొండవీటి వాగు ప్రవాహానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మట్టి తొలగించే పనులు చేపట్టామన్నారు. శాఖమూరు, పెనుమాక, నీరుకొండ రిజర్వాయర్లలో సగం పనులు పూర్తయినట్లు చెప్పారు.

గురువారం రాజధాని ప్రాంతంలో వివిధ అభివృద్ధి పనులను మంత్రి నారాయణ పరిశీలించారు. N9, N8, N7 రోడ్లలో కొండవీటి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిల పనులను సమీక్షించి, వాగు ప్రవాహానికి అడ్డంకులు లేకుండా మట్టి తొలగించాలని అధికారులను ఆదేశించారు. వాగు వెడల్పు తక్కువగా ఉన్న ప్రాంతాల్లో మరింత వెడల్పు చేయాలని సూచించారు. నీరుకొండలో నిర్మాణాధీన రిజర్వాయర్ పనులను కూడా పర్యవేక్షించారు.

రైతులను వైకాపా రెచ్చగొడుతోందని మంత్రి నారాయణ ఆరోపించారు. రైతుల మధ్య విభేదాలు సృష్టించి విధ్వంసం చేయాలని ఆ పార్టీ చూస్తోందని మండిపడ్డారు. అమరావతిపై వైకాపా కమిటీలు వేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయో నేరుగా వచ్చి చూస్తే తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

రైతుల భూములు వెనక్కి ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. భవనాలు, రోడ్లు, పైపు లైన్ల నిర్మాణం పూర్తయ్యాక భూములు ఇవ్వడం సాధ్యమా అని నిలదీశారు. అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి నారాయణ తీవ్రంగా విమర్శించారు.

Tags:    

Similar News