N. Chandrababu Naidu Reviews Fuel Shortage: రాష్ట్రంలో ఇంధన (ఎల్పీజీ) కొరత ఏర్పడే అవకాశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. గ్లోబల్ పరిస్థితుల ప్రభావంతో సరఫరాలో అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

రాష్ట్ర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిరంతర సరఫరా కొనసాగించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రత్యామ్నాయాలపై కూడా దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా ఇండక్షన్ స్టౌలు, పైప్ గ్యాస్ వినియోగాన్ని ప్రోత్సహించాలని తెలిపారు.

పైప్ గ్యాస్ ప్రాజెక్టులకు వేగంగా అనుమతులు ఇవ్వాలని, వాటి అమలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది ఖర్చు తక్కువగా ఉండటంతో పాటు కాలుష్యాన్ని కూడా తగ్గిస్తుందని పేర్కొన్నారు.

ఇక ప్రజల్లో భయాందోళనలు అవసరం లేదని సీఎం భరోసా ఇచ్చారు. ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా పర్యవేక్షిస్తూ, సరఫరాలో ఎలాంటి అంతరాయం రాకుండా చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఇంధన అందుబాటును మెరుగుపర్చేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని సీఎం ఆదేశించారు. అవసరమైతే మరిన్ని ప్రత్యామ్నాయ వనరులను కూడా వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు.

Tags: