N. Chandrababu Naidu Says: దక్షిణ కోస్తా రైల్వే జోన్‌తో ఉత్తరాంధ్రానికి పారిశ్రామిక పురోగతి: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
N. Chandrababu Naidu Says: విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఏపీ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఆయన పేర్కొన్నారు.
2026 జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా ఈ జోన్ అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించనుంది. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస-ఇచ్ఛాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్‌లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగాన్ని పూర్తిగా మార్చేస్తుందని సీఎం తెలిపారు.
నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయం ద్వారా రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి, ముఖ్యంగా ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి ఈ నిర్ణయం బాగా ఉపయోగపడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఏపీ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని మన్నించి చరిత్రాత్మక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌లకు ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ విషయాన్ని ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు చేసి సీఎం సంతోషం వ్యక్తం చేశారు.
ఈ అభివృద్ధి చర్యలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడంతో పాటు, పారిశ్రామిక యూనిట్లు, ఉపాధి అవకాశాలు పెరగడానికి దోహదపడతాయని విశ్లేషకులు అంటున్నారు.