Chandrababu Issues a Strong Warning: మత విద్వేషాలకు తావులేదు.. చంద్రబాబు కఠిన హెచ్చరిక

చంద్రబాబు కఠిన హెచ్చరిక

Update: 2026-07-10 11:49 GMT

Chandrababu Issues a Strong Warning: రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను సహించేమని, అలాంటి సంఘవిద్రోహ శక్తులు, రౌడీలు, గూండాలను ప్రోత్సహించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంగా హెచ్చరించారు.

నంద్యాల జిల్లా బనగానపల్లిలో గురువారం ‘మీ భూమి... మీ హక్కు’ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు అప్పలాపురం, కాపులపల్లి గ్రామాల రైతులకు అధునాతన పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గొడ్డలి పార్టీ (వైకాపా) విరామం లేకుండా కుట్రలు, కుతంత్రాలు చేస్తోందని విమర్శించారు.

“రాయలసీమలో వాళ్లు రక్తచరిత్ర రాశారు. నేను కొత్త చరిత్ర లిఖించబోతున్నాను. ఇది రత్నాల సీమ. రాయలసీమలో ముఠా సంస్కృతి లేకుండా చేసింది నేనే. 2019-24 మధ్య భారీగా గంజాయి పెంచారు. ఇప్పుడు కూడా రౌడీలు, గంజాయి, బ్లేడు బ్యాచులు, మాదకద్రవ్యాలు ఉపయోగించేవారిని వైకాపా ప్రోత్సహిస్తోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఎక్కడా శాంతి భద్రతల సమస్యలు తలెత్తలేదు” అని చంద్రబాబు తెలిపారు.

వైకాపా పాలనలో దేవాలయాలను అపవిత్రం చేశారని, శ్రీరాముడి విగ్రహం తల తొలగించడం, అంతర్వేది రథం కాల్చడం, దుర్గగుడిలో వెండి సింహాలు మాయం చేయడం వంటి ఘటనలు జరిగినా ఒక్క చర్య కూడా తీసుకోలేదని ఆరోపించారు. ఆదోని శివాలయంలో దీపంతో సిగరెట్ వెలిగించుకున్న ఘటనను ప్రస్తావిస్తూ, ఇప్పుడు అలాంటి పనులు చేసేవారిని వదిలిపెట్టబోమని, దేవాలయాలను ప్రక్షాళన చేస్తున్నామని, రౌడీలు ఆడబిడ్డల జోలికి వస్తే అదే వారి చివరి రోజు అని కఠినంగా హెచ్చరించారు.

రావణ్ లాంటి వాళ్లకు ఆర్థిక సాయం

రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించినా అలాంటి వారికి గొడ్డలి పార్టీ ఆర్థిక సాయం చేస్తోందని విమర్శించారు. తాను చర్చి, మసీదుకు వెళ్తే అక్కడి సంప్రదాయాలను గౌరవిస్తానని, జగన్ తిరుమలకు వచ్చినా డిక్లరేషన్ ఇవ్వరని ఉదాహరణగా చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మం కాలజ్ఞానం ప్రకారం ఇలాంటి వింతలు జరుగుతాయని, రవ్వలకొండను తవ్వకుండా కాపాడామని గుర్తు చేశారు.

భూసమస్యలకు పరిష్కారం

రాష్ట్రంలో భూసమస్యలు చాలా మందిని క్షోభపెడుతున్నాయని, దళారీ వ్యవస్థ లేకుండా గ్రామసభల ద్వారా పాసు పుస్తకాలు పంపిణీ చేస్తున్నామని చంద్రబాబు వివరించారు. ఇప్పటికే 29.04 లక్షల పాసు పుస్తకాలు ఇచ్చామని, 2027 మార్చి నాటికి 72.07 లక్షలు ఇవ్వాలని లక్ష్యం అని తెలిపారు.

రైజింగ్ రాయలసీమ

రాయలసీమను రత్నాల సీమగా, ఇప్పుడు రైజింగ్ రాయలసీమగా మార్చుతున్నామని, ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ టౌన్‌షిప్‌లు, పుట్టపర్తిలో ఫైటర్ జెట్లు, హీరో మోటార్స్, అడిడాస్, స్పేస్ సిటీ, ఎన్‌ఫీల్డ్ వంటి పరిశ్రమలు వస్తున్నాయని సీఎం ప్రకటించారు. బనగానపల్లిలో సిమెంటు పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, తన సొంత గడ్డకు అన్యాయం జరగనివ్వనని హామీ ఇచ్చారు.

సభలో కొంతమంది మహిళలు ప్లకార్డులు ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిజమైన సమస్యలైతే వినతిపత్రాలు ఇవ్వాలని, సభకు అవాంతరాలు కల్పించవద్దని సూచించారు. ఎల్‌నినో కారణంగా వర్షాలు తగ్గడం, జలాశయాల్లో నీటి మట్టం తగ్గడం వంటి సమస్యలను ప్రస్తావిస్తూ, జలధార, జలహారతి కార్యక్రమాల ద్వారా నీటిని సమర్థవంతంగా నిల్వ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, ఎంపీ శబరి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News