Pattabhiram: లూటీకి ప్రతీక జగన్.. పారిశ్రామికాభివృద్ధికి ప్రతీక చంద్రబాబు: పట్టాభిరామ్ తీవ్ర ఆరోపణలు
పట్టాభిరామ్ తీవ్ర ఆరోపణలు
Pattabhiram: వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, తండ్రి అధికారాన్ని ఆసరాగా చేసుకుని పరిశ్రమలకు భూముల కేటాయింపు పేరుతో క్విడ్ ప్రో క్వో (Quid Pro Quo) ద్వారా జగన్ కోట్లాది రూపాయలు దండుకున్నారని ఆరోపించారు.
బ్రాహ్మణి స్టీల్స్ పేరుతో రాయలసీమ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తానని భ్రమ కల్పించి భారీ దోపిడీ చేశారని పట్టాభిరామ్ విమర్శించారు. బ్రాహ్మణి స్టీల్స్‌కు 14 వేల ఎకరాల ప్రజల సొత్తు మరియు ప్రభుత్వ భూములను కారుచౌకగా కట్టబెట్టారని, కేటాయించిన భూములను రూ.350 కోట్లకు తాకట్టు పెట్టి భారీ ఆర్థిక అక్రమాలు చేశారని ఆయన ఆరోపించారు.
రెడ్ గోల్డ్ ఎంటర్‌ప్రైజెస్, ఆర్‌ఆర్ గ్లోబల్ ఎంటర్‌ప్రైజెస్ నుంచి జగతి పబ్లికేషన్స్‌కు రూ.44 కోట్లు, ఇందిరా టెలివిజన్‌కు రూ.30 కోట్లు వెళ్లిన విషయం నిజమా అని ప్రశ్నించారు. కోట్లు దండుకున్నా బ్రాహ్మణి స్టీల్స్‌లో ఒక్క ఇటుక కూడా పేర్చలేదని, 2007 జూన్ 10న బ్రాహ్మణి స్టీల్స్ శంకుస్థాపన కార్యక్రమాన్ని జగన్ స్వయంగా నిర్వహించారని గుర్తు చేశారు.
ఓబులాపురం గనుల్లో భారీ అక్రమాలు జరిగాయని సీబీఐ స్పష్టం చేసినా, 2022 ఆగస్టులో జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో ఓబులాపురం గనులపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అఫిడవిట్ దాఖలు చేసిందని పట్టాభిరామ్ తెలిపారు.
జగన్ లూటీ చేసిన 14 వేల ఎకరాల ప్రభుత్వ భూములను కూటమి ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుందని చెప్పారు. నాడు పరిశ్రమల పేరుతో లూటీ చేసిన జగన్‌కు భిన్నంగా, నేడు కూటమి ప్రభుత్వం నిజమైన పరిశ్రమలను తీసుకొచ్చి యువతకు ఉపాధి విప్లవం సృష్టిస్తోందని పేర్కొన్నారు. కియా నుంచి ప్రారంభమైన పారిశ్రామిక ప్రగతి ఇప్పుడు గూగుల్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఆర్సెలార్ మిట్టల్ వంటి ప్రపంచ స్థాయి సంస్థల పెట్టుబడులతో ముందుకు సాగుతోందని వివరించారు.
లూటీకి ప్రతీక జగన్ అయితే.. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగాలకు ప్రతీక చంద్రబాబు అని కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టం చేశారు.