Pawan Kalyan Calls: వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు.

తాగునీరు సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ, దోమల నియంత్రణ చర్యలపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ్ తదితర ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్ష నిర్వహించారు.

ప్రజారోగ్య పరిరక్షణను ప్రతి గ్రామ పంచాయతీ అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు. క్రమం తప్పకుండా పారిశుధ్య నిర్వహణ చేపట్టాలని, అన్ని పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్, క్లోరిన్ బిళ్లలు తగిన మోతాదులో అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

వర్షపు నీరు, మురుగునీరు ఎక్కడా నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవడం ద్వారా దోమల వ్యాప్తిని కట్టడి చేయాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, రోజువారీ చెత్త సేకరణ శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయకుండా అవగాహన కల్పించాలని తెలిపారు.

‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతి శుక్రవారం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి మురుగునీటి నిల్వలను తొలగించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దోమలు పెరిగితే డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని, ప్రతి గ్రామంలో క్రమం తప్పకుండా ఫాగింగ్ నిర్వహించాలని సూచించారు.

సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, మైక్ అనౌన్స్‌మెంట్ల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. తాగునీటి సరఫరా వ్యవస్థపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, పైపు లైన్లలో లీకేజీలు లేకుండా చూడాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ చర్యలు సమర్థవంతంగా అమలు చేస్తే వర్షాకాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సమస్యలు తగ్గి ప్రజలు సురక్షితంగా ఉంటారని ఆయన వ్యక్తం చేశారు.

Tags: