ZPTC and MPTC Elections: జిల్లా పరిషత్‌ (జడ్పీటీసీ), మండల పరిషత్‌ (ఎంపీటీసీ) ఎన్నికల్లో సీట్ల పంపిణీపై చర్చలు జరపడానికి ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ గురువారం ఉదయం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సుమారు గంటసేపు జరిగిన ఈ భేటీలో ఇద్దరూ కలిసి ముఖ్యమైన అంశాలపై చర్చించుకున్నారు.


పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ఇచ్చినట్లుగానే జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లోనూ 30 శాతం సీట్లు కావాలని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంగా ప్రతిపాదించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 9,829 ఎంపీటీసీ స్థానాలు, 659 జడ్పీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 30 శాతం జనసేనకు కేటాయించాలని, అలాగే జడ్పీ ఛైర్మన్‌, మండల పరిషత్‌ అధ్యక్ష పదవులు కూడా అదే నిష్పత్తిలో ఉండాలని జనసేన వైపు నుంచి డిమాండ్‌ వచ్చింది.


ఈ అంశంపై టీడీపీ, జనసేన మధ్య చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. పవన్‌ కల్యాణ్‌ సీఎం క్యాంప్‌ కార్యాలయానికి ఎలాంటి సెక్యూరిటీ లేదా కాన్వాయ్‌ లేకుండా ఒంటరిగా వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన తాజా పరిణామాలు, కూటమి కార్యాచరణ తదితర అంశాలపైనా వారు చర్చించుకున్నట్లు తెలిసింది.


జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు తుది నిర్ణయం రావాల్సి ఉంది. కూటమి పార్టీల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని ఇరుపక్షాలు కోరుకుంటున్నాయి.

Tags: