Pemmmasani Chandrasekhar Urges: గుంటూరు-విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్‌ప్లాజా వద్ద ఏర్పడుతున్న వెస్ట్ బైపాస్ ట్రాఫిక్ సమస్యలను తక్షణం పరిష్కరించాలని కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ కోరారు.

సోమవారం దిల్లీలో నితిన్ గడ్కరీని కలిసిన పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీలోని పలు రహదారి సమస్యలను వివరించారు. ముఖ్యంగా చిన్నకాకాని జంక్షన్ వద్ద తలెత్తుతున్న ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు ప్రమాదాలను గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.

విజయవాడ వెస్ట్ బైపాస్‌ను ఎన్‌హెచ్-16తో అనుసంధానం చేసే చిన్నకాకాని జంక్షన్ వద్ద ప్రస్తుతం గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్‌ఛేంజ్ లేదా యూ-డైరెక్షన్ ఫ్లైఓవర్ లేకపోవడంతో ట్రాఫిక్ జామ్‌లు, ప్రమాదాలు పెరుగుతున్నాయని పెమ్మసాని వివరించారు. ఈ ప్రాంతంలో గ్రేడ్ సెపరేటెడ్ ఇంటర్‌ఛేంజ్ లేదా ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు.

ఈ ప్రాజెక్టు పూర్తి అయితే గుంటూరు-విజయవాడ మధ్య రాకపోకలు సులభతరం అవుతాయని, పరిశ్రమలు, ఐటీ సంస్థలు, విద్యా, వైద్య సంస్థలకు మెరుగైన కనెక్టివిటీ లభిస్తుందని పెమ్మసాని తెలిపారు. ఇది ప్రాంతీయ అభివృద్ధికి కీలకమైన మౌలిక సదుపాయం అని ఆయన అన్నారు.

తను లేవనెత్తిన అంశాలపై నితిన్ గడ్కరీ వెంటనే స్పందించి, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారని పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

Tags: