కృష్ణానదికి వరద ప్రవాహం చేరుతున్నందున ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్ధ ఎండీ ప్రఖర్‌ జైన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఆయా జిల్లాల అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు ప్రఖర్ జైన్ తెలిపారు. ప్రకాశం బ్యారేజి వద్ద వరద ప్రవాహం 3 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందన్నారు. బుధవారం సాయంత్రం 7 గంటల వరకు సుంకేశుల వద్ద ఇన్ ఫ్లో 1.06లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 1.05 లక్షల క్యూసెక్కులు, శ్రీశైలం డ్యామ్ వద్ద ఇన్ ఫ్లో 2.79 లక్షల క్యూసెక్కులు, ఔట్ ఫ్లో 3.17 లక్షల క్యూసెక్కులు, నాగార్జునసాగర్ వద్ద ఇన్ ఫ్లో 2.82 లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 3.10 లక్షల క్యూసెక్కులు, పులిచింతల వద్ద ఇన్ ఫ్లో 3.01 లక్షల క్యూసెక్కులు , ఔట్ ఫ్లో 3.25లక్షల క్యూసెక్కులు, ప్రకాశం బ్యారేజ్ వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 77,804 క్యూసెక్కులు వరద ప్రవాహం ఉన్నట్లు విపత్తు నిర్వహణ సంస్ధ వెల్లడించింది.

ఎప్పటికప్పుడు కృష్ణా వరద ప్రవాహాన్ని పర్యవేక్షిస్తూ అధికారులకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు జారీ చేస్తున్నట్లు ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు. కృష్ణా నది మీద ప్రాజెక్టుల్లోని నీటిని దిగువకు విడుదల చేస్తున్నందున కృష్ణానదీ పరీవాహక ప్రాంత ప్రజలు, లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ కోరారు. బోట్లు, మోటర్ బోట్లు, పంట్లు, స్టీమర్లలతో నదిలో ప్రయాణించవద్దన్నారు. వరద నీటిలో ఈతకు వెళ్ళడం, స్నానాలకు వెళ్ళడం, చేపలు పట్టడం లాంటివి చేయకూడదన్నారు. పశువులు, గొర్రెలు, మేకలు వంటి జంతువులను సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా గోదావరి,కృష్ణా నదుల వరద హెచ్చుతగ్గుల దృష్ట్యా పూర్తి స్థాయిలో వరద తగ్గే వరకు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్ధ ఎండీ ప్రఖర్‌ జైన్‌ సూచించారు.

Tags: