Minister Lokesh: రాష్ట్రంలో పారదర్శకంగా నిర్వహించిన డీఎస్సీపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ చేస్తున్న ఆరోపణలపై ఆయనతోనే నేరుగా బహిరంగ చర్చకు సిద్ధమని విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో తెదేపా కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ, వైఎస్సార్‌సీపీ హయాంలో జరిగిన మద్యం, భూకుంభకోణాలపైనా జగన్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.

“ఇప్పటి వరకు 2 లక్షల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనచరిత్ర తెదేపాది. జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదు. 150 రోజుల్లో రికార్డు స్థాయిలో డీఎస్సీ నిర్వహిస్తే 150 కేసులు వేసి అడ్డుకోవాలని చూశారు. వాటన్నింటినీ కోర్టులు కొట్టివేశాయి” అని లోకేశ్ అన్నారు. జగన్‌కు క్రెడిట్ చోరీ డిజార్డర్ (సీసీడీ) అనే వ్యాధి ఉందని వ్యంగ్యం చేశారు. కూటమి ప్రభుత్వం తెచ్చిన పరిశ్రమలను తానే తెచ్చానని చెప్పుకోవడం ఆ జబ్బు లక్షణమని అన్నారు.

అంగన్వాడీల విషయంలో వైఎస్సార్‌సీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మంత్రి మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు అమ్మఒడి పథకం అందలేదని, కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేసిందని తెలిపారు. పెనమలూరు నియోజకవర్గంలో అంగన్వాడీలు నిర్వహించిన కృతజ్ఞత ర్యాలీని వైఎస్సార్‌సీపీ నేతలు నిరసనగా చూపుతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై ‘ఫేక్ వర్సెస్ రియల్’ పేరుతో వీడియో విడుదల చేశారు.

కార్యకర్తల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో వైద్య పరీక్షలు చేయించి ఉచిత మందులు అందించే కార్యక్రమం చేపడుతున్నామని లోకేశ్ తెలిపారు. 2029 ఎన్నికల్లోనూ తెదేపా, జనసేన, భాజపా కలిసి పోటీ చేస్తాయని చెప్పినప్పుడు పవన్ కల్యాణ్ ఫోన్ చేసి 15 ఏళ్లపాటు కూటమి కొనసాగుతుందని చెప్పమని కోప్పడ్డారని నవ్వుతూ చెప్పారు.

Tags: