AP Police System: భవిష్యత్ నేరాలను ఎదుర్కొనేందుకు ఏపీ పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు
విప్లవాత్మక మార్పులు
AP Police System: రాబోయే రోజుల్లో మారిపోయే నేరాల స్వరూపానికి అనుగుణంగా పోలీసింగ్ వ్యవస్థను సన్నద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ - రిట్రీట్’ అనే పేరుతో విజయవాడలోని డా. బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో రాష్ట్ర క్యాడర్ ఐపీఎస్ అధికారులంతా మేధోమథనం చేపట్టారు. హోం మంత్రి వంగలపూడి అనిత మంగళవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో రాబోయే 20-25 ఏళ్లలో నేరాలు ఎలా ఉంటాయని, వాటిని ఎదుర్కోవడానికి పోలీసు వ్యవస్థను ఎలా తీర్చిదిద్దాలనే అంశాలపై సమగ్ర చర్చ జరిగింది. ఈ నెల 23న ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు.
2047 నాటికి నేరాలు ఎలా ఉంటాయి?
నేరాలకు భౌగోళిక సరిహద్దులు ఉండవు. విదేశాల్లోని నేరగాడు అనంతపురంలోని రైతును క్షణాల్లో మోసం చేయవచ్చు. ఆటోమేటెడ్ కోడింగ్ ద్వారా ఒక్క రాత్రి వేలాది దోపిడీలు జరగవచ్చు.
గగనతలంలో తక్కువ ఎత్తులో ఎయిర్ ట్రాఫిక్ విపరీతంగా పెరుగుతుంది. జాతీయ రహదారి-16పై ప్రస్తుత రద్దీ కంటే ఎక్కువ డ్రోన్ ట్రాఫిక్ ఉంటుంది. డ్రోన్ దాడులు, క్రిటికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రక్షణ వంటి సవాళ్లు ఎదురవుతాయి.
డీప్‌ఫేక్‌లు, కల్పిత దృశ్యాల ద్వారా ప్రజల మనస్తత్వాలు, ఎన్నికలు, సమాజంలోని నమ్మకాలపై దాడులు జరగవచ్చు.
ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి సైబర్ నేరాలు, డ్రోన్ థ్రెట్స్, మహిళలు-చిన్నారుల భద్రత, రోడ్డు భద్రత, మానవ వనరుల అభివృద్ధి, సాంకేతిక ఆధునికీకరణ వంటి ఆరు కీలక అంశాలపై ఆరు వర్కింగ్ గ్రూపులు రెండు రోజులు చర్చించనున్నాయి.
నియామకాలు, శిక్షణల్లో మార్పులు
కోడింగ్, క్రిప్టో, సింథటిక్ మీడియా వంటి కొత్త తరహా నేరాలను ఎదుర్కోవడానికి సిబ్బందికి డేటా సైన్స్, బీహేవియరల్ ఎకనామిక్స్ వంటి నైపుణ్యాలు అవసరమని చర్చలో తేలింది. నియామక విధానాల్లో మార్పులు తీసుకురావాలని సూచించారు. సైబర్ నేరాల్లో ఛార్జ్‌షీట్ శాతం మెరుగుపరచడం, రికవరీ-దర్యాప్తు బలోపేతం చేయడం, ఏఐ ద్వారా సృష్టించే బాలల లైంగిక వేధింపుల మెటీరియల్ వంటి నేరాలను అరికట్టడం వంటి అంశాలపై దృష్టి సారించారు.
ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు
హోం మంత్రి అనిత మాట్లాడుతూ, కొత్త తరహా నేరాలను ఎదుర్కోవడానికి రాష్ట్రస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. పోలీసింగ్‌లో సత్వర, వేగవంతమైన స్పందన తప్పనిసరి అని, ప్రెడిక్షన్, ప్రికాషన్, ప్రివెన్షన్ (3పీ) విధానాన్ని అనుసరించాలని సూచించారు. 2001లో చంద్రబాబు హయాంలో జరిగిన రిట్రీట్ తర్వాత 25 ఏళ్లకు మళ్లీ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, 2047 నాటికి ఎక్కువ నేరాలు డిజిటల్ వేదికలపై జరుగుతాయని, అత్యాధునిక సాంకేతికత, కృత్రిమ మేధ, డిజిటల్ ఫోరెన్సిక్ సామర్థ్యాలను బలోపేతం చేసుకోవాలని అన్నారు. బలమైన డిజిటల్ సెక్యూరిటీ ఎకోసిస్టమ్ నిర్మాణం భవిష్యత్ పోలీసింగ్‌కు కీలకమని వ్యాఖ్యానించారు.
ఈ రిట్రీట్ ద్వారా ఏపీ పోలీసు వ్యవస్థ భవిష్యత్ సవాళ్లకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది.