సాంకేతిక సమస్యలకు సరైన కారణం లేదని స్పష్టం చేసిన నీలంసాహ్ని

State Election Commission: పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణకు నాలుగు వారాల గడువు పెంచాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) నీలంసాహ్ని తోసిపుచ్చారు. గడువు పెంచేందుకు సరైన కారణం లేనందున, పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాల్సిందేనని ఆమె పునరుద్ఘాటించారు. ఆలస్యమైన పంచాయతీల విషయంలో పునఃసమీక్షించి తదుపరి నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నారు.

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి రాసిన లేఖకు ఎస్‌ఈసీ బుధవారం సమాధానమిచ్చారు. ‘ఎలక్టోరల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టం’లో కొత్త సాఫ్ట్‌వేర్‌ మాడ్యూల్‌ ఆధారంగా పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు ప్రచురించాలన్న ఎస్‌ఈసీ ఆదేశాలపై రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఇటీవల లేఖ రాశారు. కొత్త విధానంతో పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీ, ప్రచురణకు సాంకేతికంగా పలు సమస్యలు తలెత్తుతున్నట్లు ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. వీటిని అధిగమించేందుకు నాలుగు వారాల గడువు కోరారు.

అయితే, ఈ విజ్ఞప్తిని ఎస్‌ఈసీ తిరస్కరించింది. సాంకేతిక సమస్యలు అధిగమించడానికి గడువు పొడిగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం జాబితాల ప్రచురణను కొనసాగించాలని ఆదేశించారు. ఇది స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతలో ముఖ్యమైన అంశంగా మారింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, సమయానుకూలతను నిర్ధారించడమే లక్ష్యమని ఎస్‌ఈసీ వ్యాఖ్యానించింది.

Tags: