Minister Narayana: అమరావతిపై వైకాపా దుష్ప్రచారాలు మానకపోతే 11 సీట్లు కూడా రావు: మంత్రి నారాయణ
మంత్రి నారాయణ
Minister Narayana: రాజధాని అమరావతిలో శనివారం ఉదయం మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జిలను స్థలం పరిశీలించారు. అమరావతి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా వాగులపై 43, ఎల్‌పీఎస్ లే అవుట్‌లలో 26 బ్రిడ్జిలను సీఆర్‌డీఏ నిర్మిస్తోంది. వర్షాకాలంలో ఈ బ్రిడ్జిల వద్ద నీటి ప్రవాహానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ, “రాజధాని అమరావతిపై వైకాపా నేతలు ఇలాగే అబద్ధాలు, దుష్ప్రచారాలు కొనసాగిస్తే 11 సీట్లు కూడా రావు” అని హెచ్చరించారు. కొండవీటి వాగు, పాలవాగు పనులు వేగంగా జరుగుతున్నాయని, రెండు వాగులపై మొత్తం 69 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని వెల్లడించారు. వర్షాకాలంలో ఎక్కడా నీరు నిలవకుండా చూస్తున్నామని తెలిపారు.
అమరావతిలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని నారాయణ ప్రకటించారు. భవనాల నిర్మాణాలకు ఎక్కువ ఖర్చు అని వైకాపా నేతలు ఆరోపిస్తున్న విషయానికి స్పందిస్తూ, “మనం కట్టే అనేక భవనాలు ఐకానిక్‌గా ఉంటాయి. అందుకే ఖర్చు ఎక్కువ” అని వివరించారు. పార్లమెంట్ భవనం, తెలంగాణ సచివాలయం భవనాల నిర్మాణంలో తొలి టెండర్ల సమయంలోనే భారీగా ఖర్చు అయిందని, వైకాపా నేతలు ఆ విషయం దాచిపెడుతున్నారని మంత్రి మండిపడ్డారు.
అమరావతి నిర్మాణం వేగంగా సాగుతోందని, ఎలాంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తామని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు.