Minister Kolusu Parthasarathy: సామాజిక మాధ్యమాలను వాడుకుని కూటమి నాయకులైన చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, లోకేశ్‌లను కించపరచే వ్యాఖ్యలు చేయించడాన్ని సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తీవ్రంగా ఖండించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో జగన్‌ తన వ్యతిరేకులను ఇష్టానుసారంగా తిట్టించినట్లు ఇప్పుడు సోషల్‌ మీడియా ద్వారా విద్వేషాలు రెచ్చగొట్టుతున్నారని మంత్రి మండిపడ్డారు.

సచివాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడిన మంత్రి పార్థసారథి, “ప్రజాస్వామ్యం గురించి నటుడు ప్రకాశ్‌రాజ్‌ మాకు పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు. హక్కుల పేరుతో విద్వేషాలు రెచ్చగొట్టి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యాఖ్యలు చేసినా, ఇతరుల వ్యక్తిత్వాన్ని హననం చేసినా చట్టం తన పని తాను చేస్తుంది” అని స్పష్టం చేశారు.

అధికారంలో ఉన్నప్పుడు జగన్‌ రాయలసీమ-ఉత్తరాంధ్ర మధ్య విద్వేషాలు రెచ్చగొట్టారని, ప్రజలు వ్యతిరేకించినా ఆయన ధోరణి మారలేదని ఆయన ఆరోపించారు. 2019 ఎన్నికల ముందు కోడికత్తి, తుని రైలు దహనం, బాబాయ్‌ హత్య వంటి ఘటనలను అడ్డుపెట్టుకుని అధికారంలోకి వచ్చిన జగన్‌, ఇప్పుడు గంజాయి బ్యాచ్‌లు, రౌడీ మూకలను వాడుకుని కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని దుయ్యబట్టారు.

అమరావతి రాజధాని అంశంపై కూడా మంత్రి తీవ్రంగా స్పందించారు. 2014-19 మధ్య తెదేపా ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్‌ మావిగన్‌ గురించి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నప్పుడు మూడు రాజధానుల పేరుతో మూడు ప్రాంతాలతో ఆడుకున్న జగన్‌ ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేశారని విమర్శించారు. తెదేపా 2019లో ఓడిపోయినా అమరావతి రాజధాని అయి ఉండాలని పోరాడిందని, జగన్‌ది నిలకడ లేని మనస్తత్వమని అన్నారు. రాజధాని విషయంలో విద్వేషాలు రగిల్చడానికి గంజాయి బ్యాచ్‌లు, రౌడీషీటర్లను అమరావతికి తీసుకొచ్చి రైతుల పేరుతో నాటకాలు ఆడుతున్నారని మంత్రి ఆరోపించారు.

Tags: