‘Telugudanam’ Hubs: జాతీయ హైవేల వెంట ‘తెలుగుదనం’ వేదికలు.. రైతులకు కొత్త ఆదాయం, తెలుగు సంస్కృతికి కొత్త ఊపిరి!
రైతులకు కొత్త ఆదాయం, తెలుగు సంస్కృతికి కొత్త ఊపిరి!
‘Telugudanam’ Hubs: మన భూమి, మన పంట, మన వంటకాలు – ఇవన్నీ కలిసి తెలుగుదనం ఉట్టిపడేలా జాతీయ రహదారుల వెంట కొత్త వేదికలు ఏర్పాటు చేయాలని సేవ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విజయ్‌రామ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. ప్రతి జిల్లాలో రైతు సొసైటీలకు ఐదెకరాలు లీజు కేటాయించాలని, అక్కడ ‘తెలుగుదనం’ పేరుతో సుమారు 600 రకాల ఆంధ్ర వంటకాలను ప్రజలకు పరిచయం చేయాలని ప్రతిపాదించారు. అమ్మమ్మ, నానమ్మల చేతివంటల సాంప్రదాయ రుచులు ప్రజలకు చేర్చి, తెలుగు సంస్కృతిని ఉద్దీపనం చేయాలన్నది వారి ఆశయం.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రైతుబజార్లు, శిల్పారామాల ఏర్పాటు ద్వారా వ్యవసాయం, సంస్కృతికి చంద్రబాబు ఎంతో మద్దతు అందించారని విజయ్‌రామ్ గుర్తు చేశారు. అదే తరహాలో ‘తెలుగుదనం’ వేదికలు నిర్మించడానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సుభాష్ పాలేకర్ సహజ వ్యవసాయ విధానాలను మొదటిసారి చంద్రబాబే సూచించారని కూడా ఆయన పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రురాలు ఝాన్సీలక్ష్మీబాయి, విజయ్‌రామ్ గురువారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి ఈ ప్రతిపాదనలు వివరంగా వివరించారు. ‘తెలుగుదనం’ వేదికల ద్వారా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయానికి అవకాశం కల్పిస్తే రైతులకు భారీ మేలు చేకూరుతుందని వారు చెప్పారు. ఈ సందర్భంగా మచిలీపట్నం సమీపంలోని తరకటూరు వ్యవసాయ క్షేత్రంలో పండించిన 35 రకాల ప్రకృతి ఉత్పత్తులను సీఎంకు అందజేశారు. ఆ క్షేత్రాన్ని సందర్శించాలని చంద్రబాబు హామీ ఇచ్చారని విజయ్‌రామ్ తెలిపారు.
విశాఖపట్నంలో గత రెండేళ్లుగా ‘భోజన పండగ’ నిర్వహించి వివిధ తెలుగు వంటకాలను ప్రజలకు పరిచయం చేశామని, దానికి అపార స్పందన వచ్చిందని విజయ్‌రామ్ తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 5 వరకు ‘సబల’ పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి 50 వేల మంది హాజరయ్యారని, మన వంటకాల పట్ల ప్రజల్లో ఉన్న ఆసక్తికి ఇది స్పష్టమైన నిదర్శనమని చెప్పారు.
‘తెలుగుదనం’ వేదికల్లో తెలుగువారికి మాత్రమే ప్రత్యేకమైన సుమారు 600 వంటకాల తయారీ, ఏ కాలంలో ఏం తినాలో వివరించడం, మిఠాయిలు, పచ్చళ్లు, ఎద్దు గానుగ నూనెల తయారీ, మట్టి బొమ్మలు, కుండలు తయారీ, బుట్టలు, తాటి మంచాలు అల్లడం వంటి సాంప్రదాయ కళలపై శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక. జానపద గేయాలు, తెలుగు పద్యాలు, మహనీయుల వీరగాథలు తెలుసుకునే వేదికగా కూడా ఈ కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. గో-ఆధారిత వ్యవసాయం, వాననీటి సంరక్షణ, దేశీయ విత్తనాల సంరక్షణ, దేశవాళీ ఆవుల పెంపకం వంటి అంశాలపై నిరంతర శిక్షణ కూడా ఇవ్వనున్నారు.
ఈ ‘తెలుగుదనం’ వేదికలు రైతులకు ఆదాయ మార్గాలు తెరుస్తాయని, తెలుగు సంస్కృతి-సంప్రదాయాలను యువతరం వరకు చేర్చి ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయని విజయ్‌రామ్, ఝాన్సీలక్ష్మీబాయి ఆశాభావం వ్యక్తం చేశారు.