CM Chandrababu: ‘మూడు ముక్కలాట’ అయిపోయింది.. ఇప్పుడు మావిగన్: సీఎం చంద్రబాబు
సీఎం చంద్రబాబు
CM Chandrababu: వికసిత్ భారత్ జీరామ్‌జీ (VIBHAG JIRAMJI) పథకం గ్రామాల ముఖచిత్రం మార్చే కార్యక్రమమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ పథకంపై ప్రధాని నరేంద్ర మోదీని అభినందించాలని కోరారు. గతంలో ఉపాధి హామీ పథకాన్ని రాయలసీమ నుంచే ప్రారంభించిన సంగతిని గుర్తు చేశారు. ఇప్పుడు మెరుగైన సవరణలతో ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు.
తిరుపతి జిల్లా ముక్కాలవారి పల్లెలో ఈ పథకానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్రం నుంచి రూ.7,700 కోట్లు, రాష్ట్ర వాటా రూ.4,000 కోట్లు కలిపి మొత్తం రూ.11,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు.
“ఈ పథకం కింద ఏ అభివృద్ధి పని అయినా చేసుకోవచ్చు. భూసార పరిరక్షణ, రహదారులు, డ్రైనేజీలు నిర్మించుకోవచ్చు. కొత్త ఆలోచనలు, విధానాలతో సమాజానికి మేలు చేసేలా కేంద్రం సంకల్పించింది. పని రోజులను 100 నుంచి 125కి పెంచడం సంతోషించే విషయం. దొంగ లెక్కలు రాసుకోలేని విధంగా డిజిటల్ విధానం తీసుకొచ్చారు. పారదర్శకత కోసం రియల్ టైమ్ మానిటరింగ్ ఉంటుంది” అని చంద్రబాబు వివరించారు.
గాలేరు-నగరి కాల్వను కోడూరుకు తీసుకురావడం తమ బాధ్యత అని, జలధారల ద్వారా భూగర్భ జలాలను పెంచుకోవాలని సంకల్పించినట్లు చెప్పారు. ఎంజీఎన్‌రేగాలో గతంలో కేంద్ర-రాష్ట్ర వాటా 90-10గా ఉండగా, ఇప్పుడు రాష్ట్ర వాటా 40 శాతం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిధులు దారి మళ్లించారని విమర్శించారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నాయకత్వంలో గ్రామాల రూపురేఖలు మారుతాయని, ఒకేసారి గ్రామసభలు నిర్వహించి గిన్నిస్ రికార్డు సృష్టించిన ఘనత పవన్‌దని ప్రశంసించారు. 2024 ఆగస్టు 23న రాష్ట్రవ్యాప్తంగా 13,226 గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారని, వేల కి.మీ. సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు నిర్మించారని చెప్పారు. కొండ, గిరిజన ప్రాంతాల్లో రోడ్లు వేసిన ఘనత కూడా పవన్ కల్యాణ్‌దే అని కొనియాడారు.
గొడ్డలి పార్టీతో జాగ్రత్త..
రాష్ట్రంలో గొడ్డలి పార్టీ ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్నికల ముందు అమరావతి అని, తర్వాత మూడు రాజధానుల ఆట ఆడి, ఇప్పుడు మావిగన్ అంటున్నారని విమర్శించారు. అమరావతే రాజధాని, అది దేవతల రాజధాని అని స్పష్టం చేశారు. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరం పూర్తి చేస్తామని, విశాఖకు రైల్వే జోన్ సాధించామని, ఉత్తరాంధ్రకు గూగుల్ డేటా సెంటర్ వస్తోందని, రాయలసీమను రత్నాల సీమగా మారుస్తామని ఆయన ప్రకటించారు.
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్:
పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఈ పథకం తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. గ్రామాల అభివృద్ధి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ పథకం కింద రూ.7.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, ప్రతి గ్రామానికి రూ.2 కోట్లు అందజేస్తామని వెల్లడించారు. చేసిన పనికి వేతనం ఆలస్యం కాకుండా డబ్బు నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. గ్రామాలకు అధికారాలు కల్పించామని తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్:
ఏపీ గ్రామీణాభివృద్ధికి కేంద్రం అండగా నిలుస్తోందని, ప్రధాని మోదీ ఎప్పుడూ ఏపీకి సహకరిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలో ఈ పథకం అమలుకు రూ.12,845 కోట్లు ఖర్చు చేస్తామని, గత రెండేళ్లలో రూ.16,695 కోట్లు ఉపాధి నిధులు వినియోగించామని వివరించారు.
ఈ కార్యక్రమం గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేసి, రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడుతుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.