Liquor Scam: లిక్కర్ కుంభకోణంలో వైసీపీ నాయకుల అనియంత్రిత దోపిడీ

వైసీపీ నాయకుల అనియంత్రిత దోపిడీ

Update: 2025-09-08 01:11 GMT

Liquor Scam: గత జగన్‌ ప్రభుత్వంలో రూ.3,500 కోట్ల లిక్కర్‌ స్కామ్‌లో ఎందరో వైసీపీ నేతలు దోపిడీ చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో కొత్త కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కుట్రదారులు, లబ్ధిదారులు, పాత్రధారుల జాబితా రోజురోజుకూ పెరిగిపోతోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకూ ఈ స్కామ్‌లో ఎందరికో వాటాలు ఉన్నాయి.

సిట్‌ విచారణలో మరో నలుగురు కీలక వైసీపీ నేతలకు లిక్కర్‌ ముడుపులు అందినట్టు ఆధారాలు లభించాయి. ఉత్తరాంధ్రలో ఒక కీలక నేత మేనల్లుడు, గోదావరి జిల్లాల్లో టీడీఆర్‌ బాండ్లతో పేరొందిన మాజీ మంత్రి, గుంటూరు జిల్లాలో మాజీ మంత్రి, ఉమ్మడి అనంతపురం జిల్లాలో  మాజీ ఎమ్మెల్యే భారీగా లిక్కర్‌ సొమ్ము దండుకున్నట్టు సమాచారం. ఇంకా కొంతమంది వైసీపీ నేతలు మద్యం సరఫరా ట్రాన్స్‌పోర్టర్లు, హాలోగ్రామ్‌ కాంట్రాక్టర్లు, సెక్యూరిటీ, మ్యాన్‌పవర్‌ ఏజెన్సీల నుంచి నెలకు కనీసం రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వసూలు చేసినట్టు తెలిసింది.

వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి వ్యాపార భాగస్వామి విజయానంద రెడ్డి (ఎర్రచందనం స్మగ్లర్‌)ని సిట్‌ అధికారులు విచారించగా, చిత్తూరులోని ఆయన కాంప్లెక్స్‌లో సోదాలు చేసినప్పుడు కీలక డేటా లభించింది. ఈ డేటాలో ఎవరెవరికి ఎంత ముడుపులు ఇచ్చారనే వివరాలు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత మేనల్లుడికి, గుంటూరు జిల్లాలో జరిగిన ప్లీనరీ ఖర్చులకు ప్రతిఫలంగా భారీ ముడుపులు అందినట్టు సమాచారం. గోదావరి జిల్లాల్లో మాజీ మంత్రికి, గుంటూరు జిల్లాలో వివాదాస్పద మాజీ మంత్రికి, అనంతపురం జిల్లాలో మాజీ ఎమ్మెల్యేకు కూడా లిక్కర్‌ సొమ్ము చేరినట్టు ఆధారాలు సేకరించారు.

మద్యం ఉత్పత్తిదారుల నుంచి వేల కోట్లు, ట్రాన్స్‌పోర్టర్లు, హాలోగ్రామ్‌ కాంట్రాక్టర్లు, ఖాళీ సీసాలు, అట్టపెట్టెల విక్రయం వరకూ దోచుకున్నారు. కొందరు నేతలు ప్రతి నెలా ముడుపులు వసూలు చేశారు. సిట్‌ అధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. త్వరలో నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచే అవకాశం ఉంది.

Tags:    

Similar News