CM Chandrababu: పేదలకు నాణ్యమైన వైద్య సేవలు తప్పక అందిస్తాం: సీఎం చంద్రబాబు

వైద్య సేవలు తప్పక అందిస్తాం: సీఎం చంద్రబాబు

Update: 2025-12-25 07:00 GMT


పీపీపీ విధానంపై రాజీ లేదు.. దుష్ప్రచారాన్ని తిప్పికొట్టండి


CM Chandrababu: పేదలకు ఉన్నతమైన కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు, వైద్య విద్యను అందించే విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానాన్ని రాష్ట్రంలోనూ కొనసాగించడంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. ఈ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణం, ఆసుపత్రుల మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ మేరకు దుష్ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తిప్పికొట్టాలని సూచించారు.

వైద్యారోగ్య శాఖపై సచివాలయంలో బుధవారం సీఎం సమీక్ష నిర్వహించారు. పీపీపీ మోడల్‌లో చేపట్టే వైద్య కళాశాలలకు కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్)తో పాటు ఇతర ప్రోత్సాహకాలు అందించాలని ఆదేశించారు. కేంద్రం సూచించినట్టు సామాజిక-ఆరోగ్య రంగ ప్రాజెక్టులకు వీజీఎఫ్ కింద 60 శాతం ఆర్థిక సాయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 30:30 నిష్పత్తిలో భరించనున్నట్టు అధికారులు వివరించారు. ఇప్పటికే అరుణాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, ఉత్తర్ ప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఈ విధానంలో వైద్య కళాశాలలు, ఆసుపత్రుల నిర్మాణానికి కేంద్రం అనుమతులు ఇచ్చిందని గుర్తు చేశారు.

టెండర్లు వేగవంతం చేయండి

తొలి విడతలో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలలకు సెప్టెంబర్ 18న టెండర్లు ఆహ్వానించిన విషయాన్ని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. రెండు ప్రీ-బిడ్ సమావేశాల్లో ఆరు జాతీయ-అంతర్జాతీయ సంస్థలు పాల్గొన్నాయి. బిడ్డర్లు అడిగిన అదనపు సమాచారం, సైట్ సందర్శన సమయం, భూమి కేటాయింపు, కన్సార్టియం సభ్యుల సంఖ్య పెంచడం వంటి అంశాలకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఆదోని వైద్య కళాశాలకు ఒక సంస్థ ముందుకొచ్చిన నేపథ్యంలో దానితో ఒప్పందం కుదుర్చుకుని నిర్మాణ చర్యలు ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. మిగతా మూడింటి టెండర్లను వేగవంతం చేసేందుకు బిడ్డర్లతో మరిన్ని సంప్రదింపులు జరపాలని సూచించారు.

సంజీవని ప్రాజెక్టు అమలుకు చర్యలు

ప్రతి పౌరుడికీ డిజిటల్ హెల్త్ కార్డులు అందించే సంజీవని ప్రాజెక్టును సమర్థవంతంగా అమలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. కుప్పం పైలట్ ప్రాజెక్టు అనుభవాల ఆధారంగా ఎదురైన సవాళ్లను అధిగమించి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించాలని నిర్దేశించారు.

Tags:    

Similar News