Chiranjeevi Nag: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీకి ఒక్క సీటు కూడా గెలవదని, కావాలంటే సర్వే నివేదికలు చూడండని మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు చిరంజీవి నాగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపైనే ఆయన తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

మంగళవారం ఆమదాలవలసలోని తమ్మినేని నివాసంలో మాట్లాడుతూ, ఈ నెల 12న స్థానిక సంస్థల ఎన్నికలపై వైసీపీ నేతలు నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు బాధ కలిగించాయని అన్నారు. చింతాడ రవి అరెస్టు రాజకీయమని, తమ్మినేని సీతారాం అరెస్టు కాకపోవడం బంధుత్వమని మాట్లాడటం కలచివేసిందని చెప్పారు. ఈ మాటలను వేదికపై ఉన్న జిల్లా పరిశీలకుడు భూడి ముత్యాలనాయుడు, పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు కుంభ రవి, ధర్మాన ప్రసాదరావులు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు.

పెద్దదిక్కు అని చెప్పుకొనే వారు పార్టీని నడిపించే పద్ధతి ఇదేనా అని అడిగారు. జగన్ నమ్మకంతో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్‌కు బాధ్యతలు ఇస్తే.. ఆ స్థానంలో ఉండి గొర్లె కిరణ్ వ్యాఖ్యలు ఎందుకు ఖండించలేదని నిలదీశారు. ఒక కులాన్ని ఆధారంగా చేసుకుని రాజకీయాలు చేయాలనుకుంటే అధిష్ఠానానికి చెప్పాలని సూచించారు. జిల్లా అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ వ్యవహరించే తీరు సక్రమంగా లేదని, పెద్దదిక్కు అని చెప్పుకొనే ధర్మాన ప్రసాద్‌రావు అభద్రతాభావంతో ఉంటున్నారని అన్నారు. భూడి ముత్యాల నాయుడికి జిల్లాలో ఏం పని అంటూ ప్రశ్నించారు.

తమ్మినేని సీతారాం రాజకీయ జీవితానికి ఫుల్‌స్టాప్‌లు ఉండవని, కామాలు మాత్రమే ఉంటాయని చిరంజీవి నాగ్ స్పష్టం చేశారు. గతంలో ఎచ్చెర్ల నియోజకవర్గంలో ధర్మాన నుంచి కిరణ్‌ను కాపాడింది సీతారాం కాదా అని ప్రశ్నించారు. తమ్మినేని, కూన రవికుమార్ మధ్య రాజకీయ ఒప్పందం ఉందంటూ వైసీపీ నేతలే వ్యాఖ్యలు చేయటం ఏంటని నిలదీశారు. ఈ అంశంపై ధర్మాన సోదరులు, కుంభ రవిబాబు, భూడి ముత్యాల నాయుడు మాట్లాడకపోవడం దారుణమని అన్నారు.

సీతారాం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వివక్షత చూపలేదని చెప్పారు. జిల్లాలో ఒకే కులం కోసం పార్టీ ముందుకు పోతుందని ప్రజలు చర్చించుకుంటున్నారని తెలిపారు. చింతాడ రవి వైసీపీ ఆమదాలవలస అభ్యర్థిగా ఉంటారో లేదోనని నేతల్లో అభద్రత ఉందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే శ్రీకాకుళం జిల్లాలో త్వరలో జరిగే ఎన్నికల్లో వైసీపీ ఒక్క సీటు కూడా గెలవదని హెచ్చరించారు. వైసీపీ అధిష్ఠానం శ్రీకాకుళం జిల్లా నాయకత్వ తీరుపై ఒక సర్వే చేయాలని కోరారు.

Tags: