Y.S. Jagan Mohan Reddy: డీఎస్సీ నియామకాలు, స్పోర్ట్స్ కోటాలో భారీ కుంభకోణం జరిగిందని ఆరోపించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి.. సీబీఐ విచారణకు డిమాండ్

సీబీఐ విచారణకు డిమాండ్

Update: 2026-06-12 02:50 GMT

Y.S. Jagan Mohan Reddy: కేంద్ర ప్రభుత్వం విషయంలో తాను పెద్దగా వ్యాఖ్యానించదలచుకోలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం తెలిపారు.

కేంద్రం గురించి మాట్లాడేందుకు పరిమితమైన అంశాలు ఉన్నాయని, అయితే రాష్ట్రంలో ఎన్నికల హామీలు ఏవీ నెరవేర్చలేదని, అన్నీ కుంభకోణాలే అని జగన్ విమర్శించారు. ఏ వర్గమూ సంతోషంగా లేదని వ్యాఖ్యానించారు.

డీఎస్సీ-2025పై సీబీఐ విచారణ:

డీఎస్సీ-2025 పరీక్షపై సీబీఐ విచారణ జరపాలని జగన్ డిమాండ్ చేశారు. “పేపర్ తయారీలో ఎవరెవరు ఉన్నారు? డిజిటల్ యాక్సెస్ ఎవరి చేతుల్లో ఉంది? ఎంతమందికి పేపర్ లీక్ అయింది? ఎంతమేర లంచాలు చేతులు మారాయి? ఇవన్నీ తేలాలి. లేకపోతే వైకాపా అధికారంలోకి వచ్చాక విచారణ కమిషన్ వేసి తప్పు చేసినవారిని శిక్షిస్తాం” అని హెచ్చరించారు.

స్పోర్ట్స్ కోటా కుంభకోణం:

స్పోర్ట్స్ కోటాకు సంబంధించి గతంలో ఉన్న 74 జీఓలను రద్దు చేసి, తమవారికి ఉద్యోగాలు కట్టబెట్టడం కోసం జీఓ 4, 47లను తీసుకొచ్చారని జగన్ ఆరోపించారు. క్రీడల్లో పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు ఉంటే చాలు, డీఎస్సీ పరీక్ష రాయక్కర్లేదని నిబంధనలు పెట్టి 270 ఉద్యోగాలు ఇచ్చారన్నారు. సాఫ్ట్‌బాల్‌లో 38, జూడోలో 39 మందికి పోస్టులు ఇచ్చినట్లు చెప్పారు.

సాఫ్ట్‌బాల్ అసోసియేషన్‌కు తెదేపా ఎమ్మెల్యే కూన రవికుమార్ అధ్యక్షుడని, జూడో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు మంత్రి లోకేశ్ తోడల్లుడని, తెదేపా ఎంపీ భరత్ సంబంధం ఉన్నట్లు పేర్కొన్నారు. తమవారికి ఉద్యోగాలు ఇచ్చాక జీఓ 4, 47లను రద్దు చేసి 25, 56 జీఓలు తీసుకొచ్చారని, మొదటి జీఓలు మంచివే అయితే ఎందుకు రద్దు చేశారని ప్రశ్నించారు.

జెన్ జీల హెచ్చరిక:

“ఇప్పుడు జెన్ జీలో ఉన్నాం, జెన్ ఆల్ఫా కూడా వచ్చేసింది. ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. జెన్ జీలు అందులో భాగమే. వారి ఆశలను నలిపేస్తే కోట్లమంది కాక్రోచ్‌లు వస్తారు. అందులో నేనూ ఒకడినవుతా” అని జగన్ అన్నారు.

చంద్రబాబుపై వ్యాఖ్యలు:

“అబద్ధం, మోసం, వెన్నుపోటు, దగా, కుంభకోణానికి చొక్కా, ప్యాంటు తగిలిస్తే కనిపించేది చంద్రబాబే” అని జగన్ వ్యాఖ్యానించారు. డీఎస్సీ లాంటి విషయాలపై ప్రశ్నిస్తే చంద్రబాబుకు బీపీ ఎక్కువవుతుందని, ఆయన పోతారేమోనని భయమేస్తోందని ఎద్దేవా చేశారు.

బెంగళూరు ప్రయాణం:

మాజీ సీఎం జగన్ గురువారం బెంగళూరుకు వెళ్లారు. ఇటీవల విశాఖపట్నం వెళ్లి వచ్చిన ఆయన సాయంత్రం బెంగళూరు బయల్దేరారు.

Tags:    

Similar News