5-Star Safety EVs : సేఫ్టీలో తగ్గేదే లే...భారత NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించిన సూపర్ సేఫ్ కార్లు ఇవే
భారత NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించిన సూపర్ సేఫ్ కార్లు ఇవే
5-Star Safety EVs : భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ రోజురోజుకు పెరుగుతోంది. కంపెనీలు కేవలం ఎక్కువ రేంజ్ ఇవ్వడంపైనే కాకుండా, ప్రయాణికుల భద్రత పై కూడా దృష్టి పెడుతున్నాయి. దీని ఫలితంగా భారత NCAP (న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్) క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించిన అనేక ఈవీ మోడళ్లు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ఈ జాబితాలో ఇప్పటికే టాటా, మహీంద్రా వంటి బలమైన కంపెనీలు ఉండగా, తాజాగా మారుతి సుజుకి కూడా చేరింది.
మారుతి సుజుకి
మారుతి సుజుకి తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు మారుతి ఈ-విటారాతోనే రికార్డు సృష్టించింది. జనవరి 2026లో భారత మార్కెట్‌లో లాంచ్ కాబోతున్న ఈ కారు, లాంచ్‌కు ముందే భారత NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ-విటారాకు అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 32కి 31.49 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ లో 49కి 43 పాయింట్లు లభించాయి.
టాటా మోటార్స్
ఎలక్ట్రిక్ కార్ల సెగ్మెంట్‌లో అగ్రగామిగా ఉన్న టాటా మోటార్స్, సేఫ్టీ విషయంలోనూ ముందుంది. ఈ కంపెనీకి చెందిన అనేక ఈవీ మోడల్స్‌కు 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో టాటా హారియర్ ఈవీ, టాటా పంచ్ ఈవీ, టాటా నెక్సన్ ఈవీ, టాటా కర్వ్ ఈవీ వంటి మోడళ్లు ఉన్నాయి. హారియర్ ఈవీ అడల్ట్ ప్రొటెక్షన్‌లో 32కి 32 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 49కి 45 పాయింట్లు సాధించింది. అలాగే, పంచ్ ఈవీ కూడా అడల్ట్ ప్రొటెక్షన్‌లో 31.46 పాయింట్లు, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 45 పాయింట్లు సాధించింది. నెక్సన్ ఈవీ, కర్వ్ ఈవీ కూడా ఈ పరీక్షల్లో అత్యధిక పాయింట్లు సాధించి 5-స్టార్ రేటింగ్‌ను నిలబెట్టుకున్నాయి.
మహీంద్రా EVలు కూడా భద్రమే
టాటా తర్వాత భారత మార్కెట్‌లో ఎక్కువ ఈవీ మోడళ్లను కలిగి ఉన్న మహీంద్రా కూడా ప్రయాణికుల సేఫ్టీకి పెద్ద పీట వేసింది. మహీంద్రాకు చెందిన XUV 400 EV, XEV 9e, BE 6 వంటి పలు ఈవీ మోడల్స్‌కు భారత NCAP టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ముఖ్యంగా మహీంద్రా XEV 9e అడల్ట్ ప్రొటెక్షన్‌లో 32కి 32 పాయింట్లు సాధించగా, BE 6 మోడల్ 31.97 పాయింట్లు సాధించింది. ఈ రెండు మోడళ్లు చైల్డ్ ప్రొటెక్షన్‌లో 45 పాయింట్లు సాధించాయి. XUV 400 EV కూడా అడల్ట్ ప్రొటెక్షన్‌లో 30.38 పాయింట్లతో, చైల్డ్ ప్రొటెక్షన్‌లో 43 పాయింట్లతో 5-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. ఈ గణాంకాలన్నీ భారతీయ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ కార్లలో భద్రతకు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాయో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఇది వినియోగదారులు మరింత ఆత్మవిశ్వాసంతో ఈవీలను ఎంచుకోవడానికి దోహదపడుతుంది.