Auto News:పెట్రోల్ కార్ల ఆధిపత్యానికి షాక్.. దూసుకుపోతున్న సిఎన్జి, ఇవి, హైబ్రిడ్ వాహనాలు!
సిఎన్జి, ఇవి, హైబ్రిడ్ వాహనాలు!
Auto News: భారత పాసింజర్ వెహికల్ మార్కెట్‌లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ఆటోమొబైల్ రంగాన్ని ఏలిన పెట్రోల్ కార్ల ఏకఛత్రాధిపత్యానికి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) విడుదల చేసిన జులై డేటా ప్రకారం.. CNG, హైబ్రిడ్, ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు పెట్రోల్ వాహనాల అమ్మకాల స్థాయికి చేరుకున్నాయి.
పెట్రోల్ వర్సెస్ ఆల్టర్నేటివ్ ఫ్యూయల్
FADA నివేదిక ప్రకారం జులై నెలలో ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ వాహనాల వాటా ఏకంగా 40.59 శాతానికి చేరుకోగా, పెట్రోల్ వాహనాల వాటా 41.68 శాతంగా నమోదైంది. అంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసం కేవలం 1.09 శాతం మాత్రమే ఉంది. గతేడాది ఇదే సమయానికి ఈ వ్యత్యాసం దాదాపు 13.21 శాతంగా ఉండేది. ఆల్టర్నేటివ్ ఫ్యూయల్ విభాగంలో అత్యధికంగా CNG వాహనాలు 24.67 శాతం వాటాతో అగ్రస్థానంలో నిలవగా, హైబ్రిడ్ వాహనాలు 8.02 శాతం, ఎలక్ట్రిక్ వాహనాలు 7.90 శాతం వాటాను దక్కించుకున్నాయి.
అన్ని విభాగాల్లో రికార్డు స్థాయి అమ్మకాలు
జులై నెలలో భారత ఆటో రిటైల్ మార్కెట్‌లో మొత్తం 25,91,138 వాహనాలు అమ్ముడయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఇది 25.89 శాతం పెరుగుదల. FADA చరిత్రలోనే మొదటిసారిగా టూ-వీలర్స్, త్రీ-వీలర్స్, పాసెంజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్స్, ట్రాక్టర్లు, కన్స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ అనే ఆరు విభాగాలు కూడా ఒకే నెలలో తమ బెస్ట్ సేల్స్ రికార్డులను సాధించాయి. ఇందులో టూ-వీలర్స్ విక్రయాలు 18,18,289 యూనిట్లుగా నమోదు కాగా, పాసెంజర్ వాహనాల విక్రయాలు జులైలో తొలిసారిగా 4 లక్షల మార్కును దాటి 4,16,555 యూనిట్లకు చేరుకున్నాయి.
సేల్స్ పెరగడానికి గల కారణాలు
GST 2.0 విధానం వల్ల వాహనాల ధరలు తగ్గడం, సులభమైన ఫైనాన్స్ సౌకర్యాలు లభించడం, సకాలంలో పండుగల సీజన్ ప్రారంభం కావడం ఈ రికార్డు సేల్స్‌కు కారణమని FADA వైస్ ప్రెసిడెంట్ సాయి గిరిధర్ వెల్లడించారు. రాబోయే ఆగస్టు నుంచి అక్టోబర్ నెలల మధ్య స్వాతంత్ర్య దినోత్సవం, ఓనం, రక్షాబంధన్ వంటి పండుగలు ఉండటం, మంచి వర్షపాతంతో గ్రామీణ ప్రాంతాల్లో కొనుగోలు శక్తి పెరగడంతో 87.85% మంది డీలర్లు వ్యాపారం మరింత పుంజుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.