Cars on Amazon: ఆన్‌లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ ఇప్పటివరకు బట్టలు, ఎలక్ట్రానిక్స్, నిత్యావసర వస్తువులను మాత్రమే విక్రయిస్తూ వచ్చింది. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ఏకంగా కార్ల విక్రయ రంగంలోకి కూడా ప్రవేశిస్తోంది. అమెరికా వెలుపల తొలిసారిగా 2027 ప్రారంభంలో బ్రిటన్ మార్కెట్లో Amazon Autos సేవలను ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. దీనికోసం ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్తో అమెజాన్ జతకట్టింది. ఈ కొత్త విధానం ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే కొత్త, పాత కార్లను పరిశీలించి బుక్ చేసుకునే వెసులుబాటు కలగనుంది.

హ్యుందాయ్ కార్లతో షురూ

అమెజాన్ ఆటోస్ ప్రారంభ భాగస్వామిగా హ్యుందాయ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ ప్లాట్‌ఫామ్‌పై ఎలక్ట్రిక్, హైబ్రిడ్, పెట్రోల్ కార్ల విభాగాల్లో అనేక ఆప్షన్లు అందుబాటులో ఉంటాయి. తొలి దశలో హ్యుందాయ్ కంపెనీకి చెందిన IONIQ 3, IONIQ 5, KONA ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలతో పాటు పాపులర్ హ్యాచ్‌బ్యాక్ i20 కార్లు అమెజాన్ సైట్‌లో లిస్ట్ కానున్నాయి. వీటితో పాటు బ్రిటన్‌కు చెందిన ప్రముఖ డీలర్ గ్రూప్ వెర్టూ మోటార్స్ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ కార్లను కూడా కొనుగోలుదారులు ఇక్కడ చూడవచ్చు. రాబోయే రోజుల్లో మరిన్ని ఆటోమొబైల్ బ్రాండ్లు ఇందులో చేరనున్నాయి.

ఆన్‌లైన్‌లో కారు ఎంపిక, బుకింగ్ ప్రక్రియ ఎలా ఉంటుంది?

ఈ సర్వీస్ అందుబాటులోకి వచ్చాక కస్టమర్లు నేరుగా Amazon.co.uk వెబ్‌సైట్‌లోకి వెళ్లి వివిధ కార్ల మోడళ్లు, వాటి ఫీచర్లు, ధరలను సులభంగా పోల్చి చూసుకోవచ్చు. అంతేకాకుండా తమకు నచ్చిన కారును ఆన్‌లైన్‌లోనే రిజర్వ్ చేసుకునే సదుపాయం ఉంటుంది. పాత కారు ఎక్స్ఛేంజ్ విలువను అంచనా వేసుకోవడం, కొత్త కారుకు అవసరమైన ఫైనాన్స్ ఆప్షన్లను తెలుసుకోవడం కూడా ఇక్కడే సాధ్యమవుతుంది. అయితే కారు కొనుగోలు ప్రక్రియ మొత్తం పూర్తిగా ఆన్‌లైన్‌లో జరగదు. ఆన్‌లైన్‌లో రిజర్వ్ చేసుకున్న తర్వాత, తుది చెల్లింపులు, కారు డెలివరీ కోసం సంబంధిత డీలర్‌షిప్ షోరూమ్‌కు వెళ్లాల్సి ఉంటుంది.

కార్ల ధరలను అమెజాన్ నిర్ణయిస్తుందా?

ఈ ప్లాట్‌ఫామ్‌పై విక్రయించే కార్ల ధరల విషయంలో అమెజాన్ స్పష్టత ఇచ్చింది. కార్ల ధరలను అమెజాన్ ఏమాత్రం నిర్ణయించదని, కేవలం ఆయా కార్ల డీలర్లు మాత్రమే ధరలను ఖరారు చేస్తారని తెలిపింది. అమెజాన్ కేవలం కొనుగోలుదారులకు, డీలర్లకు మధ్య ఒక పారదర్శకమైన డిజిటల్ వారధిగా మాత్రమే పనిచేస్తుంది.

అమెరికాలో సూపర్ సక్సెస్

అమెజాన్ సంస్థ 2024 డిసెంబర్‌లో తొలిసారిగా అమెరికాలో Amazon Autos సేవలను ప్రారంభించింది. అక్కడ అనూహ్య స్పందన రావడంతో ప్రస్తుతం అమెరికాలోని 150కి పైగా నగరాల్లో ఈ సేవలు విజయవంతంగా నడుస్తున్నాయి. కారు కొనడం అనేది ఏ వ్యక్తి జీవితంలోనైనా ఒక అతిపెద్ద ఆర్థిక నిర్ణయమని, అమెజాన్‌లో సాధారణ వస్తువులు కొన్నంత సులభంగా, ఎలాంటి గందరగోళం లేకుండా కారు కొనుగోలు అనుభవాన్ని అందించడమే తమ లక్ష్యమని అమెజాన్ ఆటోస్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ మ్యాట్ నఫోర్ట్ పేర్కొన్నారు.

Tags: