Mahindra: ఆటోమొబైల్ మార్కెట్‌ను షేక్ చేసేందుకు మహీంద్రా మాస్టర్ ప్లాన్.. ఒకేసారి 4 క్రేజీ కొత్త కార్లు
| ఒకేసారి 4 క్రేజీ కొత్త కార్లు
Mahindra: భారత కార్ల మార్కెట్లో రెండో స్థానం కోసం టాటా మోటార్స్, హ్యుందాయ్ సంస్థలతో గట్టిగా పోటీపడుతున్న మహీంద్రా, తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు భారీ వ్యూహాన్ని రచించింది. రాబోయే కొన్ని నెలల్లో, అంటే 2027 ఏప్రిల్ నాటికి ఒకదాని తర్వాత ఒకటి నాలుగు కొత్త మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ జాబితాలో పెట్రోల్, డీజిల్ వాహనాలతో పాటు ఆధునిక ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలు కూడా ఉన్నాయి. అప్డేటెడ్ థార్ రాక్స్, XEV 9e స్పోర్టెక్, BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీ, స్కార్పియో లైఫ్‌స్టైలర్ ఈ జాబితాలో ఉన్నాయి.
కొత్త సస్పెన్షన్‌తో అప్డేటెడ్ థార్ రాక్స్
2024 జులైలో విడుదలై సూపర్ హిట్ అయిన థార్ రాక్స్ ఎస్‌యూవీకి మహీంద్రా త్వరలోనే కీలక అప్డేట్స్ ఇవ్వనుంది. ఇందులో థార్ ఓజీలో వాడిన కొత్త డావిన్సీ డ్యాంపర్లను అమర్చనున్నారు. దీనివల్ల గతుకుల రోడ్లపై ప్రయాణించేటప్పుడు కుదుపులు తగ్గి ప్రయాణం ఎంతో సాఫీగా ఉంటుంది. ఇందులోని DCx వాల్వ్ కారు నెమ్మదిగా కదిలేటప్పుడు బాడీ బ్యాలెన్స్ కాపాడుతుండగా, Ride Refine RC1 వాల్వ్ రోడ్డు ఎత్తుపల్లాల వల్ల వచ్చే తీవ్రమైన షాక్‌లను నియంత్రిస్తుంది.
డిసెంబర్ 8న రానున్న మహీంద్రా XEV 9e స్పార్టెక్
మహీంద్రా ప్రీమియం ఎలక్ట్రిక్ కారు XEV 9e కొత్త వెర్షన్ 'XEV 9e స్పార్టెక్ పేరుతో డిసెంబర్ 8న విడుదలయ్యే అవకాశం ఉంది. ఇందులో 70 kWh LFP బ్యాటరీ ప్యాక్, వెనుక భాగంలో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయి. ఇది 241 hp శక్తిని, 380 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 580 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని అంచనా. ఫాస్ట్ ఛార్జింగ్ ద్వారా 20 నుంచి 80 శాతం బ్యాటరీ కేవలం 20 నిమిషాల్లోనే నిండుతుంది. కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లో కరోకే, డ్రిఫ్ట్ మోడ్, ఫ్రంట్ ప్యాసింజర్ స్క్రీన్కు పేరెంటల్ లాక్ వంటి ఫీచర్లు రానున్నాయి.
700 కి.మీ రేంజ్‌తో మహీంద్రా BE 07 ఎలక్ట్రిక్ ఎస్యూవీ
టాటా హారియర్ ఈవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు మహీంద్రా BE 07 అనే నాలుగో ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని సిద్ధం చేస్తోంది. సుమారు 4.6 మీటర్ల పొడవు, 1.9 మీటర్ల వెడల్పుతో ఇది చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో XEV 9e స్పోర్టెక్ తరహా బ్యాటరీ, మోటార్ ఉండబోతున్నాయి. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 700 కిలోమీటర్ల వరకు ప్రయాణించే రేంజ్ ఇస్తుందని సమాచారం. 2027 ఫిబ్రవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీన్ని ప్రదర్శించి, మార్చి 2027లోపు మార్కెట్లోకి విడుదల చేయనున్నారు.
అడ్వెంచర్ లవర్ల కోసం మహీంద్రా స్కార్పియో లైఫ్ స్టైలర్
స్కార్పియో-ఎన్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా స్కార్పియో లైఫ్‌స్టైలర్ అనే పికప్ ట్రక్కును 2027 ఏప్రిల్‌లోపు లాంచ్ చేయనున్నట్లు మహీంద్రా ధృవీకరించింది. రూ.19.79 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరతో వచ్చే అవకాశం ఉన్న ఈ వాహనాన్ని, సాహస యాత్రలు చేసేవారిని, వాణిజ్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందిస్తున్నారు. ఇందులో 2.0-లీటర్ టర్బో పెట్రోల్, 2.2-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఆప్షన్లు ఉంటాయి. 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లతో పాటు రెండు ఇంజిన్లలోనూ పార్ట్-టైమ్ 4WD సదుపాయం లభించనుంది.