Used Car: భారతదేశంలో కారు కొనడం అనేది ఏ మధ్యతరగతి కుటుంబానికైనా ఒక పెద్ద కల, అంతకుమించి కీలకమైన ఆర్థిక నిర్ణయం. ఒక్కసారి కారు కొన్నాక కనీసం ఐదారు ఏళ్ల పాటు దాన్ని వాడుతుంటారు. అందుకే 2026లో కూడా కస్టమర్ల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే.. షోరూమ్‌కు వెళ్లి కొత్త కారు కొనాలా? లేక తక్కువ బడ్జెట్‌లో మంచి కండిషన్‌లో ఉన్న సెకండ్ హ్యాండ్ కారు తీసుకోవాలా? సరైన నిర్ణయం తీసుకోవాలంటే కేవలం ఎక్స్-షోరూమ్ ధర, మైలేజీ మాత్రమే చూస్తే సరిపోదు. రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్, జీఎస్టీ, ఇన్సూరెన్స్, లోన్ వడ్డీ రేట్లు, భవిష్యత్తులో అమ్మినప్పుడు వచ్చే రీసేల్ విలువను కూడా లెక్కగట్టాలి.

కొత్త కారు కొంటే కలిగే లాభాలు, నష్టాలు ఇవే..

కొత్త కారు కొనడంలో ఉన్న అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే, ఇందులో లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లు, ఆధునిక ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కంపెనీ అందించే పూర్తి వారంటీ లభిస్తాయి. గతంలో ఎవరూ వాడకపోవడం వల్ల ఎలాంటి ప్రమాదాల చరిత్ర, దాచిన లోపాలు ఉండవు. పైగా బ్యాంకులు కొత్త కార్లకు తక్కువ వడ్డీ రేటుకే సులభంగా రుణాలు ఇస్తాయి, కంపెనీ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి. అయితే కొత్త కారుకు ప్రారంభ ఖర్చు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్సూరెన్స్, ట్యాక్స్ భారం అధికంగా ఉండటమే కాకుండా, కొన్న మొదటి రెండు మూడేళ్లలోనే కారు విలువ వేగంగా పడిపోతుంది. తొందరగా అమ్మాలనుకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది.

సెకండ్ హ్యాండ్ కారు ఎవరికి సరైన ఎంపిక?

తక్కువ బడ్జెట్‌లో పెద్ద కారు లేదా టాప్ ఎండ్ వేరియంట్ కావాలనుకునే వారికి సెకండ్ హ్యాండ్ కారు ఉత్తమ ఎంపిక. పాత కారుకు ఇన్సూరెన్స్ ఖర్చు తక్కువగా ఉంటుంది. అంతేకాకుండా కారు విలువలో జరగాల్సిన తగ్గుదల ఇప్పటికే జరిగిపోయి ఉంటుంది కాబట్టి, రెండేళ్ల తర్వాత తిరిగి అమ్మినా పెద్దగా నష్టం ఉండదు. కానీ ఇందులో కొన్ని రిస్క్‌లు కూడా ఉన్నాయి. కారుకు గతంలో యాక్సిడెంట్ అయి ఉండవచ్చు లేదా ఇంజిన్ సమస్యలు ఉండవచ్చు. వారంటీ తక్కువగా ఉండటంతో మరమ్మతుల ఖర్చు పెరిగే అవకాశం ఉంది. అలాగే పాత కార్లపై లోన్ వడ్డీ రేట్లు కొత్త కార్లతో పోలిస్తే ఎక్కువగా ఉంటాయి.

కొత్త, పాత కార్లపై జీఎస్టీ నిబంధనలు ఎలా ఉన్నాయి?

సవరించిన జీఎస్టీ నిబంధనల ప్రకారం, చిన్న పెట్రోల్, డీజిల్ కార్లపై 18 శాతం జీఎస్టీ వర్తిస్తుండగా, చాలా వరకు ఎస్‌యూవీ వాహనాలపై 40 శాతం వరకు పన్ను భారం ఉంటోంది. అదే సెకండ్ హ్యాండ్ కారు విషయంలో నిబంధనలు భిన్నంగా ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు నేరుగా కారును కొనుగోలు చేసినా, విక్రయించినా ఎలాంటి జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ యూజ్డ్ కార్ డీలర్ ద్వారా కొనుగోలు చేస్తే మాత్రం నిబంధనల ప్రకారం జీఎస్టీ వర్తిస్తుంది.

పాత కారు కొనే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

CRIF విడుదల చేసిన వీల్స్ అండ్ యాంబిషన్ నివేదిక ప్రకారం.. 2021 నుంచి 2026 మధ్య దేశంలో పాత కార్ల రుణాల డిమాండ్ ఏటా 26.2 శాతం చొప్పున పెరిగింది. మీరు కూడా సెకండ్ హ్యాండ్ కారు కొనాలని నిర్ణయించుకుంటే, కారు యాక్సిడెంట్ రికార్డు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC), బ్యాంక్ ఎన్ఓసీ (NOC), సర్వీస్ హిస్టరీ, ఇన్సూరెన్స్ పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే డబ్బులు చెల్లించాలి.

Tags: