Aprilia: అప్రిలియా కొత్త అవతారం.. రోడ్డు మీద వెళ్తుంటే అందరి చూపులు దీనిపైనే!
అందరి చూపులు దీనిపైనే!
Aprilia: ప్రముఖ ఇటాలియన్ ప్రీమియం టూవీలర్ తయారీ సంస్థ అప్రిలియా భారత మార్కెట్లోకి తమ కొత్త మ్యాక్సీ స్కూటర్ శ్రేణిని గ్రాండ్‌గా తీసుకొచ్చింది. ఈ సారి SXR GT పేరుతో రెండు పవర్ ఫుల్ వేరియంట్లను కస్టమర్ల ముందుకు తెచ్చింది. ఎస్ఎక్స్‌ఆర్ జీటీ 125, ఎస్ఎక్స్‌ఆర్ జీటీ 175 మోడళ్లను సరికొత్త డిజైన్, మెరుగైన ఇంజిన్, అదిరిపోయే ఫీచర్లతో రూపొందించారు. లాంగ్ రైడ్స్, టూరింగ్ ఇష్టపడే వారికి ఈ స్కూటర్లు ది బెస్ట్ ఆప్షన్‌గా నిలవనున్నాయి.
పాత మోడళ్లకు గుడ్ బై
గతంలో మార్కెట్లో ఉన్న ఎస్ఎక్స్‌ఆర్ 125, ఎస్ఎక్స్‌ఆర్ 160 మోడళ్లను మే నెలలో కంపెనీ నిలిపివేసింది. వాటి స్థానంలో ఇప్పుడు ఈ కొత్త జీటీ రేంజ్‌ను ప్రవేశపెట్టింది. అప్రిలియా ఎస్ఎక్స్‌ఆర్ జీటీ 125 ధరను రూ.1.11 లక్షలుగా, ఎస్ఎక్స్‌ఆర్ జీటీ 175 ధరను రూ.1.31 లక్షలుగా (ఎక్స్-షోరూమ్) నిర్ణయించారు. పాత డిజైన్‌కు ఆధునిక సొబగులు అద్ది, మరింత కంఫర్టబుల్‌గా ఈ స్కూటర్లను డిజైన్ చేశారు.
పవర్ ఫుల్ ఇంజిన్
ఇంజిన్ విషయానికి వస్తే ఎస్ఎక్స్‌ఆర్ జీటీ 125 వేరియంట్‌లో 124.5 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ అమర్చారు. ఇది 10.6 హెచ్‌పీ పవర్, 10.4 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక టాప్ వేరియంట్ జీటీ 175లో 174.7 సీసీ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 13.3 హెచ్‌పీ పవర్, 14.1 ఎన్ఎమ్ టార్క్‌ను అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు బీఎస్-6 ఓబీడీ-2 స్టేజ్ బి నిబంధనలకు అనుగుణంగా ఉంటూ, ఇ20 పెట్రోల్‌తో నడిచేలా రూపొందడం విశేషం.
14 ఇంచీల పెద్ద టైర్లు
రహదారులపై మరింత గ్రిప్, స్టెబిలిటీ కోసం అప్రిలియా ఈసారి పెద్ద మార్పు చేసింది. రెండు స్కూటర్లలోనూ 14 ఇంచీల పెద్ద అలాయ్ వీల్స్, టైర్లను అందించింది. గుంతలు పడిన రోడ్లు, ఉబ్బెత్తు ప్రాంతాల్లో కూడా రైడర్‌కు ఎటువంటి విసుగు లేకుండా సునాయాసంగా ప్రయాణించే వెసులుబాటు కలుగుతుంది. వేగంగా వెళ్లే సమయంలోనూ బైక్ నడుపుతున్నంత కంట్రోల్ లభిస్తుంది.
టీఎఫ్‌టీ డిస్‌ప్లే, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్లు
ఎస్ఎక్స్‌ఆర్ జీటీ 175లో 5 ఇంచీల టీఎఫ్‌టీ డిజిటల్ స్క్రీన్ అందించారు. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా ఫోన్ కాల్స్, మ్యూజిక్ కంట్రోల్స్, నావిగేషన్ సదుపాయం పొందవచ్చు. రక్షణ కోసం సింగిల్ ఛానల్ ఏబీఎస్, కొత్త ఎగ్జాస్ట్ పైప్‌పై హీట్ షీల్డ్ ఏర్పాటు చేశారు. ఇక ఎస్ఎక్స్‌ఆర్ జీటీ 125లో 5 ఇంచీల ఎల్సీడీ స్క్రీన్‌తో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) లభిస్తుంది.