Upcoming Hatchbacks: భారత ఆటోమొబైల్ రంగానికి హ్యాచ్‌బ్యాక్ కార్లు గుండెకాయ లాంటివి. తక్కువ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే కార్ల కోసం మధ్యతరగతి జనాలు ఎప్పుడూ ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కస్టమర్ల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రముఖ దిగ్గజ సంస్థలైన మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటాతో పాటు చైనాకు చెందిన లీప్‌మోటార్ కంపెనీలు సరికొత్త మోడళ్లను భారత రోడ్లపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. వీటిలో కొన్ని పాపులర్ కార్ల ఫేస్‌లిఫ్ట్ వెర్షన్లు ఉంటే, మరికొన్ని ఆల్-న్యూ నెక్స్ట్ జనరేషన్ మోడళ్లుగా రాబోతున్నాయి.

టయోటా గ్లాంజా ఫేస్‌లిఫ్ట్

జపాన్ దిగ్గజం టయోటా తమ పాపులర్ గ్లాంజా ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను అక్టోబర్ 14న భారత మార్కెట్లో విడుదల చేసేందుకు సర్వం సిద్ధం చేసింది. మునుపటి లాగే ఇది మారుతి సుజుకి బలేనో ఆధారంగానే రూపుదిద్దుకోనుంది. కొత్త 1.2 లీటర్ 3-సిలిండర్ జెడ్12ఇ పెట్రోల్ ఇంజిన్‌తో ఇది రాబోతోంది. ఇది 83 బార్స్ పవర్, 112 ఎన్ఎమ్ టాపిక్ ఇస్తుంది. సీఎన్‌జీ వెర్షన్ కూడా అందుబాటులోకి రానుండటంతో మైలేజ్ ప్రియులకు మంచి ఆప్షన్ కానుంది.

i20, గ్రాండ్ i10 నియోస్ నెక్స్ట్ జనరేషన్

హ్యుందాయ్ కంపెనీ తమ లైనప్‌లో విప్లవాత్మక మార్పులు చేస్తోంది. కొత్త జనరేషన్ i20 కారును బ్రెజిల్‌లో ప్రదర్శించగా, ఈ అధునాతన మోడల్ 2027 నాటికి భారత మార్కెట్లో అడుగుపెట్టనుంది. పిక్సెల్ స్టైల్ ఎల్‌ఈడీ హెడ్‌లాంప్స్, వై-షేప్ డిఆర్‌ఎల్‌లతో ఇది సరికొత్త లుక్‌‌లో మెరిసిపోనుంది. ఇక భారతదేశంలో అత్యంత ఆదరణ పొందిన 'గ్రాండ్ i10 నియోస్' నెక్స్ట్ జనరేషన్ మోడల్ కూడా 2027 చివరి నాటికి పూర్తి కొత్త ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ డిజైన్‌తో రాబోతోంది.

మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఫేస్‌లిఫ్ట్

సామాన్యుల కారుగా పేరుగాంచిన మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రోడ్లపై టెస్టింగ్ జరుపుకుంటూ కనిపించింది. దీనిలో ప్రధాన మార్పు కొత్త జెడ్-సిరీస్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్. ప్రస్తుతం సీఎన్‌జీ కార్లలో సిలిండర్ డిక్కీలో ఉండటం వల్ల లగేజ్ పెట్టడానికి స్థలం ఉండట్లేదు. ఈ సమస్యకు చెక్ పెడుతూ కార్ అడుగుభాగంలో ఉండేలా సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చబోతున్నారు. ఇది 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో రిలీజ్ కానుంది.

చైనా ఈవీ ఎంట్రీ

చైనాకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ లీప్‌మోటార్, స్టెల్లాంటిస్‌తో కలిసి భారత మార్కెట్లోకి అడుగుపెడుతోంది. వీటి ఎంట్రీ మోడల్‌గా 'T03' అనే చిన్న ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ కారు రాబోతోంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 265 కిలోమీటర్లు ప్రయాణించే ఈ కారు ధర రూ.8 లక్షల నుంచి రూ.12 లక్షల మధ్య ఉండే అవకాశం ఉంది. ఇది భారత మార్కెట్లో టాటా టియాగో ఈవీ, ఎంజీ కామెట్ ఈవీలకు గట్టి సవాలు విసరనుంది.

Tags: