Aston Martin: మొంటేరే కార్ వీక్ 2026 వేదికగా ఆస్టన్ మార్టిన్ సంస్థ ఈ సరికొత్త వండర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. తమ బ్రాండ్ చరిత్రలోనే అత్యంత పవర్ఫుల్ ఫ్రంట్ ఇంజన్ ప్రొడక్షన్ కారుగా వేలెన్ రికార్డు సృష్టించింది. వేంక్విష్ మోడల్ నుంచి సేకరించిన 5.2 లీటర్ల ట్విన్ టర్బో V12 ఇంజన్‌ను ఇందులో అమర్చారు. ఇది ఏకంగా 850 హెచ్‌పీ పవర్, 1,000 ఎన్ఎమ్ టాార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఎనిమిది స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సహాయంతో పనిచేసే ఈ సూపర్ కార్ కేవలం 3.1 సెకన్ల వ్యవధిలోనే గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 345 కిలోమీటర్లకు పరిమితం చేశారు.

తక్కువ బరువుతో మైండ్ బ్లోయింగ్ డిజైన్

వేంక్విష్ మోడల్‌తో పోలిస్తే ఈ కొత్త కారు బరువును 110 కిలోగ్రాములు తగ్గించడం విశేషం. కార్బన్ ఫైబర్, అల్యూమినియం, టైటానియం, మెగ్నీషియం వంటి అత్యంత తేలికపాటి లోహాలను వాడి ఈ వాహనాన్ని తయారు చేశారు. వాహనం వేగంగా వెళ్లేటప్పుడు బాడీ కంట్రోల్ తప్పకుండా ఉండేందుకు వీలుగా స్టీరింగ్, బ్రేకింగ్, సస్పెన్షన్ వ్యవస్థలలో విప్లవాత్మక మార్పులు చేశారు. సాంప్రదాయ మోడళ్ల కంటే ఇది చాలా అగ్రెసివ్ లుక్‌తో రేసింగ్ ప్రేమికులను ఆకట్టుకుంటోంది.

అధునాతన ఏరోడైనమిక్ టెక్నాలజీ

కారు చక్రాల కోసం ప్రత్యేకంగా పిరెల్లి పీ జీరో ఆర్ టైర్లతో కూడిన మెగ్నీషియం వీల్స్‌ను అమర్చారు. టైర్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు విశ్లేషించే పిరెల్లి సైబర్ టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. గాలి ఒత్తిడిని తట్టుకుని కారు వేగంగా దూసుకెళ్లేందుకు వీలుగా సైడ్ ఎయిర్ వెంట్స్ ఏర్పాటు చేశారు. కారు వెనుక భాగంలో గ్లాస్ విండ్‌స్క్రీన్ తీసేసి, గట్టి ప్యానెల్ ఇచ్చారు. దీనివల్ల 170 లీటర్ల బూట్ స్పేస్ లభిస్తుంది. వెనుక వైపు సన్నటి ఎల్‌ఈడీ లైటింగ్, 3డీ ప్రింటెడ్ క్వాడ్ టైటానియం ఎగ్జాస్ట్ పైపులు కారుకి మరింత రాజసం తెచ్చిపెట్టాయి.

అంతరిక్ష విమానం లాంటి కేబిన్

ఇంటీరియర్ లగ్జరీ విషయంలో ఆస్టన్ మార్టిన్ ఎక్కడా తగ్గలేదు. 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, అంత పెద్దదే అయిన టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఇచ్చారు. ఎయిర్‌క్రాఫ్ట్ తరహా డ్రైవ్ మోడ్ సెలెక్టర్, పుష్ బటన్ స్టార్ట్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. 15 స్పీకర్ల పవర్‌ఫుల్ బౌర్స్ అండ్ విల్కిన్స్ ఆడియో సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి హంగులు ఉన్నాయి. 2027 రెండో త్రైమాసికం నుంచి ఈ కార్ల డెలివరీలు ప్రారంభం కానున్నాయి.

Tags: