Ather Energy : ఏథర్ ఎనర్జీ రికార్డుల వేట.. 6 లక్షల స్కూటర్ల అమ్మకంతో ఈవీ మార్కెట్లో సెన్సేషన్
6 లక్షల స్కూటర్ల అమ్మకంతో ఈవీ మార్కెట్లో సెన్సేషన్
Ather Energy : భారతదేశ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ సరికొత్త చరిత్ర సృష్టించింది. తన వినూత్నమైన డిజైన్, టెక్నాలజీతో దూసుకుపోతున్న ఈ కంపెనీ తాజాగా 6 లక్షల యూనిట్ల విక్రయాల మైలురాయిని అధిగమించింది. ముఖ్యంగా ఫ్యామిలీ స్కూటర్ విభాగంలో ఏథర్ తీసుకొచ్చిన రిజ్తా మోడల్ గేమ్-ఛేంజర్‌గా మారి, కంపెనీ అమ్మకాలను ఆకాశానికి చేర్చింది. కేవలం గత 16 నెలల్లోనే 3 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయంటే ఏథర్ క్రేజ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అమ్మకాల్లో అద్భుతమైన వృద్ధి
ఏథర్ ఎనర్జీ ప్రయాణం 2018లో మొదలైనప్పటికీ, తొలి కొన్నేళ్లు అమ్మకాలు నెమ్మదిగా సాగాయి. అయితే 2022 నుంచి ఈ కంపెనీ వేగం పెంచింది. వాహన్ పోర్టల్ గణాంకాల ప్రకారం.. ఏథర్ ఇప్పటివరకు మొత్తం 6,04,497 స్కూటర్లను విక్రయించింది. 2023లో తొలిసారిగా లక్ష యూనిట్ల మార్కును దాటిన ఈ సంస్థ, 2025 నాటికి ఏకంగా 2 లక్షలకు పైగా స్కూటర్లను అమ్మి 16 శాతం మార్కెట్ షేర్‌ను కైవసం చేసుకుంది. ఈ ఏడాది (2026) కేవలం నాలుగు నెలల్లోనే దాదాపు లక్ష యూనిట్లు డెలివరీ చేసి, తన మార్కెట్ వాటాను 18.5 శాతానికి పెంచుకుంది.
గేమ్-ఛేంజర్ రిజ్తా స్కూటర్
ఏథర్ సాధించిన ఈ భారీ విజయానికి వెనుక రిజ్తా స్కూటర్ పాత్ర చాలా పెద్దది. ఏప్రిల్ 2024లో లాంచ్ అయిన ఈ మోడల్, కంపెనీ మొత్తం అమ్మకాల్లో 75 శాతం వాటాను కలిగి ఉంది. ఏథర్ మొదట స్పోర్ట్స్ మోడల్స్ (450 సిరీస్) కు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ, రిజ్తాతో ఫ్యామిలీ యూజర్లను ఆకట్టుకుంది. అతిపెద్ద సీటు, విశాలమైన స్టోరేజ్, ఫ్యామిలీకి అవసరమైన ఫీచర్లు ఉండటంతో మధ్యతరగతి ప్రజలు దీనికి బ్రహ్మరథం పడుతున్నారు.
BaaS మోడల్ తో భారీ ఊరట
ధర విషయంలో ఏథర్ తీసుకొచ్చిన బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) మోడల్ కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. దీనివల్ల బ్యాటరీ ఖర్చును మినహాయించి స్కూటర్ ను తక్కువ ధరకే కొనుగోలు చేసే వెసులుబాటు కలిగింది. ఫలితంగా రిజ్తా ప్రారంభ ధర సుమారు రూ.76,000కు చేరుకుంది. ఈ వ్యూహాత్మక నిర్ణయం మార్కెట్లో ఏథర్ ను మరింత పోటీదార్గా మార్చడమే కాకుండా, పెట్రోల్ స్కూటర్ల ధరతో పోటీ పడేలా చేసింది.
మున్ముందు మరిన్ని రికార్డులు
ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో ఏథర్ ఎనర్జీ మూడో స్థానంలో ఉన్నప్పటికీ, వృద్ధి రేటు మాత్రం చాలా వేగంగా ఉంది. 2026 చివరి నాటికి కంపెనీ తన ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఎండల తీవ్రత పెరిగిన వేళ బ్యాటరీ భద్రతపై కూడా ఏథర్ ప్రత్యేక దృష్టి సారించి, కస్టమర్ల నమ్మకాన్ని చూరగొంటోంది. భారతీయ ఈవీ రంగంలో ఏథర్ చేస్తున్న ఈ కృషి వల్ల రాబోయే రోజుల్లో మరిన్ని ఆకర్షణీయమైన మోడళ్లు వచ్చే అవకాశం ఉంది.