Auto Expo 2027: భారతదేశ ఆటోమొబైల్ రంగానికి సంబంధించిన అతిపెద్ద వేడుక భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2027 రాబోయే ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు న్యూఢిల్లీలో అత్యంత వైభవంగా జరగనుంది. ఈసారి ఈ ప్రదర్శన మునుపటి కంటే ఎంతో భారీ స్థాయిలో ఉండబోతోంది. అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, తైవాన్‌లతో సహా 50కి పైగా దేశాల నుంచి ప్రతినిధులు, సుమారు 1,750కి పైగా దిగ్గజ కంపెనీలు ఇందులో పాల్గొంటున్నాయి. స్మార్టర్ మొబిలిటీ ఫర్ ఏ బెటర్ టుమారో అనే థీమ్‌తో జరుగుతున్న ఈ వేడుకలో భవిష్యత్ రవాణా వ్యవస్థకు అద్దం పట్టే సరికొత్త వాహనాలు కనువిందు చేయనున్నాయి.

ఒకే వేదికపై ఎలక్ట్రిక్ నుంచి హైడ్రోజన్ వాహనాలు

ఈ మెగా ఈవెంట్‌లో భాగంగా నిర్వహించే ఆటో ఎక్స్‌పో - ది మోటార్ షో 2027లో కనీసం 44 ప్రముఖ వాహన తయారీ సంస్థలు తమ కొత్త మోడళ్లను ప్రదర్శించనున్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్ కార్లు మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్, సీఎన్‌జీ, ఎల్‌ఎన్‌జీ, ఇథనాల్, ఫ్లెక్స్-ఫ్యూయల్, హైడ్రోజన్ ఇంధనంతో నడిచే అత్యాధునిక వాహనాలను కంపెనీలు ఆవిష్కరించబోతున్నాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మాట్లాడుతూ.. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ వేడుకలలో ఒకటిగా నిలుస్తుందని, సుమారు 25 వేల మంది విదేశీ సందర్శకులు భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

రెండు భారీ వేదికలు.. ఒకేసారి 11 ప్రత్యేక షోలు

ఈ భారీ ప్రదర్శన ఢిల్లీలోని రెండు ప్రఖ్యాత వేదికలపై సుమారు 2.5 లక్షల చదరపు మీటర్ల విస్తీర్ణంలో జరగనుంది. మొదటి వేదిక అయిన 'భారత్ మండపం' లో ఫిబ్రవరి 4 నుంచి 9 వరకు ఆటో ఎక్స్‌పో మోటార్ షో, టైర్ షో, భారత్ బ్యాటరీ షో, సైకిల్ షో, మొబిలిటీ టెక్ పెవిలియన్ నిర్వహిస్తారు. రెండో వేదిక అయిన 'యశోభూమి' లో ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు కాంపోనెంట్స్ టెక్నాలజీ షో, కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్ ఎక్స్‌పో, ఎయిర్ మొబిలిటీ, అగ్రి మొబిలిటీ, మెట్రో అర్బన్ ట్రాన్సిట్ ఎక్స్‌పో వంటి ప్రదర్శనలు కొలువుదీరనున్నాయి. చిన్న మధ్యతరహా పరిశ్రమలు(MSME), స్టార్టప్‌లకు కూడా ఇందులో ప్రత్యేక స్థానం కల్పించారు.

టికెట్ ధరలు ఎలా ఉన్నాయంటే?

ఎక్స్‌పో తొలి రెండు రోజులు అంటే ఫిబ్రవరి 4, 5 తేదీలను కేవలం మీడియా ప్రతినిధులు, వ్యాపార వర్గాల కోసం కేటాయించారు. సాధారణ ప్రజలు ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు ఈ ప్రదర్శనను సందర్శించవచ్చు. ఫిబ్రవరి 6, 7 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు ఎంట్రీ ఉంటుంది, ఈ రెండు రోజుల్లో టికెట్ ధర రూ. 300గా నిర్ణయించారు. ఇక ఫిబ్రవరి 8, 9 తేదీల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ప్రదర్శన కొనసాగుతుంది, ఈ రోజుల్లో టికెట్ ధర కేవలం రూ. 200 మాత్రమే ఉంటుంది. ఈ మెగా ఆటో షోను వీక్షించేందుకు దేశవ్యాప్తంగా 10 లక్షల మందికి పైగా సందర్శకులు తరలివస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.

Tags: