Bajaj Chetak EV : సీఎన్‌జీ బైక్‌ను కూడా చిత్తు చేసిన చేతక్.. ఈవీ క్రేజ్ అంటే ఇదే మరి
ఈవీ క్రేజ్ అంటే ఇదే మరి
Bajaj Chetak EV : బజాజ్ ఆటోమొబైల్ సామ్రాజ్యంలో ఇప్పుడు ఒకే ఒక్కడి హవా నడుస్తోంది. అదే బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. ఒకప్పుడు పెట్రోల్ బైకులతో మార్కెట్‌ను ఏలిన బజాజ్ పోర్ట్‌ఫోలియోలో, ఇప్పుడు ఈ ఒక్క ఎలక్ట్రిక్ స్కూటర్ కంపెనీలోని దిగ్గజ మోడళ్లకే చుక్కలు చూపిస్తోంది. ప్లాటినా, సీటీ 100 వంటి మైలేజీ మెషీన్లను, చివరకు ప్రపంచంలోనే మొట్టమొదటి సీఎన్‌జీ బైక్ ఫ్రీడమ్‌ను కూడా అమ్మకాల్లో వెనక్కి నెట్టి చేతక్ ఈవీ టాప్ గేర్‌లో దూసుకుపోతోంది. కేవలం పల్సర్ సిరీస్ మాత్రమే ప్రస్తుతం చేతక్ కంటే ముందు వరుసలో ఉండటం విశేషం.
బజాజ్ సంస్థ నుంచి వస్తున్న అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2025 డిసెంబర్ నెలలో బజాజ్ చేతక్ ఈవీ ఏకంగా 20,340 యూనిట్లు అమ్ముడైంది. ఇదే సమయంలో ఎంతో కాలంగా సామాన్యుడి ఆశాజ్యోతిగా ఉన్న బజాజ్ ప్లాటినా మాత్రం 17,881 యూనిట్లకు పరిమితమైంది. అంటే ప్లాటినా కంటే దాదాపు 2,500 స్కూటర్లు ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఇక ఇతర మోడళ్ల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. సీటీ (2,904 యూనిట్లు), అవెంజర్ (1,544 యూనిట్లు), డొమినార్ (794 యూనిట్లు) అమ్మకాల్లో చేతక్ దరిదాపుల్లో కూడా లేవు. చివరకు భారీ అంచనాలతో వచ్చిన సీఎన్‌జీ బైక్ 'ఫ్రీడమ్' కేవలం 515 యూనిట్లు మాత్రమే అమ్ముడై దారుణమైన పతనాన్ని చవిచూసింది.
ప్రస్తుతం ఉన్న చేతక్ విజయవంతం కావడంతో.. బజాజ్ ఇప్పుడు సరికొత్త అప్‌డేటెడ్ చేతక్ ఈవీని రంగంలోకి దించేందుకు సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన టెస్టింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొత్త మోడల్‌లో ఎల్‌ఈడీ హెడ్ లైట్లు, హ్యాండిల్‌బార్ సెక్షన్‌లోకి మారిన ఇండికేటర్లు వంటి డిజైన్ మార్పులు ఉన్నాయి. అంతేకాకుండా, ప్రస్తుతం ఉన్న స్వింగ్‌ఆర్మ్ మౌంటెడ్ మోటర్ స్థానంలో కొత్తగా హబ్ మౌంటెడ్ మోటర్ ను అమర్చబోతున్నారు. దీనివల్ల చక్రానికి నేరుగా పవర్ అందుతుంది. ఇది తక్కువ ధరలో వచ్చే వేరియంట్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.
కొత్త చేతక్ లో బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 3kWh, 3.5kWh బ్యాటరీ ప్యాక్‌లనే కొనసాగిస్తే, ఒకసారి ఛార్జ్ చేస్తే 127 కి.మీ నుంచి 153 కి.మీ వరకు రేంజ్ ఇచ్చే అవకాశం ఉంది. లోపలి వైపు కొత్త ఎల్‌సీడీ స్క్రీన్, సరికొత్త స్విచ్ గేర్ వంటి ఫీచర్లతో ఈ స్కూటర్ మరింత ప్రీమియంగా ఉండబోతోంది. ప్రస్తుత మోడల్ ధరకు అటు ఇటుగా అంటే రూ.1.20 లక్షల నుంచి రూ.1.40 లక్షల రేంజ్‌లో ఇది వచ్చే ఛాన్స్ ఉంది.
కేవలం టీవీఎస్ ఐక్యూబ్, ఓలా వంటి బ్రాండ్లకే కాకుండా, స్వంత కంపెనీలోని పెట్రోల్ వాహనాలకే చేతక్ పెద్ద పోటీగా మారింది. నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండటం, స్మూత్ డ్రైవింగ్ అనుభవం, చేతక్ బ్రాండ్ పై ఉన్న నమ్మకం వెరసి ఈ స్థాయి అమ్మకాలు సాధ్యమవుతున్నాయి. ఈ ఏడాది చివర్లో కొత్త మోడల్ కూడా తోడైతే, బజాజ్ పోర్ట్‌ఫోలియోలో పల్సర్ తర్వాత అత్యధికంగా అమ్ముడయ్యే మోడల్‌గా చేతక్ స్థిరపడిపోవడం ఖాయం.