Toyota Innova Hycross : ఫ్యామిలీకి బెస్ట్ డీల్.. జీఎస్టీ కోత తర్వాత భారీగా తగ్గిన ఇన్నోవా హైక్రాస్ ధర
జీఎస్టీ కోత తర్వాత భారీగా తగ్గిన ఇన్నోవా హైక్రాస్ ధర
Toyota Innova Hycross : భారత మార్కెట్‌లో ఫ్యామిలీ ఎంపీవీ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు మరింత ఆకర్షణీయమైన డీల్‌గా మారింది. అద్భుతమైన ఇంటీరియర్, విశాలమైన క్యాబిన్, 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ వంటి ప్రత్యేకతలతో ఈ కారు ఇప్పటికే ఫ్యామిలీలకు బెస్ట్ ఆప్షన్‌గా నిలిచింది. తాజాగా జీఎస్టీ కోత తర్వాత దీని ధరలు భారీగా తగ్గడంతో, ఇన్నోవా హైక్రాస్ ఇప్పుడు మెరుగైన బడ్జెట్ ఆప్షన్ గా మారింది. టయోటా ఇన్నోవా హైక్రాస్ కొత్త ధరలు, అత్యాధునిక ఫీచర్లు, పటిష్టమైన భద్రత, పర్ఫామెన్స్ గురించి వివరాలు తెలుసుకుందాం.
జీఎస్టీ 2.0 రేట్లు అమలులోకి వచ్చిన తర్వాత టయోటా ఇన్నోవా హైక్రాస్ ధరలు తగ్గాయి. ఈ తగ్గింపుతో కారు కొనుగోలు మరింత చౌకగా మారింది. కొత్త జీఎస్టీ రేట్ల ప్రకారం.. టయోటా ఇన్నోవా హైక్రాస్ ప్రారంభ ధర ఇప్పుడు రూ.18.06 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. దీని టాప్ మోడల్ అయిన ZX(O) హైబ్రిడ్ వేరియంట్ ధర రూ.30.83 లక్షల వరకు ఉంటుంది. ముఖ్యంగా, GX పెట్రోల్ వేరియంట్ ధరలో దాదాపు రూ.1.16 లక్షల మేర తగ్గింపు వచ్చింది. హైబ్రిడ్ మోడల్ కోరుకునే వారి కోసం VX హైబ్రిడ్ వేరియంట్ రూ.25.90 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మొదలవుతుంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ ఇంటీరియర్ చాలా విశాలంగా, లగ్జరీ కారు అనుభూతిని ఇస్తుంది. పెద్ద క్యాబిన్ స్పేస్ కారణంగా లాంగ్ ఫ్యామిలీ జర్నీలు కూడా ఎంతో సౌకర్యంగా ఉంటాయి. ఇందులో 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, టయోటా ఐ-కనెక్ట్ తో పాటు వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే, వైర్డ్ ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ ఉంది. మెరుగైన సౌండ్ కోసం 9-స్పీకర్ల జేబీఎల్ ఆడియో సిస్టమ్, సబ్ వూఫర్ కూడా ఉన్నాయి.
సేఫ్టీ విషయంలో ఇన్నోవా హైక్రాస్ అద్భుతంగా రాణించింది. దీనికి భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్ లభించింది. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS విత్ EBD, ESC, హిల్ స్టార్ట్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు వంటి ముఖ్యమైన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. టయోటా ఇన్నోవా హైక్రాస్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
మొదటిది 2.0-లీటర్ పెట్రోల్ ఇంజిన్. ఇది 173 బీహెచ్‌పి పవర్, 209 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. రెండవది 2.0-లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్. ఇది పెట్రోల్, ఎలక్ట్రిక్ మోడ్‌లలో పని చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే, పెట్రోల్ వేరియంట్ 16.13 కి.మీ/లీ మైలేజ్ ఇస్తుంది, అయితే హైబ్రిడ్ వేరియంట్ ఏఆర్‌ఏఐ (ARAI) సర్టిఫైడ్ ప్రకారం 23.24 కి.మీ/లీ వరకు మైలేజ్ ఇస్తుంది. ఫుల్ ట్యాంక్ ఇంధనంతో ఈ కారు దాదాపు 1200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదు. భారత మార్కెట్‌లో టయోటా ఇన్నోవా హైక్రాస్‌కు గట్టి పోటీ ఇచ్చే కొన్ని ప్రముఖ కార్లు ఉన్నాయి. వాటిలో మహీంద్రా XUV700, టాటా సఫారీ, టయోటా ఇన్నోవా క్రిస్టా, కియా కారెన్స్, మారుతి సుజుకి ఇన్విక్టో వంటివి ముఖ్యమైనవి.