Budget 2026 : భారత ఈవీ రంగంలో చారిత్రాత్మక విప్లవం..చైనాను దెబ్బకొట్టేలా భారీ వ్యూహం
చైనాను దెబ్బకొట్టేలా భారీ వ్యూహం
Budget 2026 : భారతదేశాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్‌గా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026లో కీలక ప్రకటనలు చేసింది. ఈ నిర్ణయాలు డ్రాగన్ కంట్రీ చైనాకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రధానంగా లిథియం-అయాన్ బ్యాటరీల తయారీలో చైనాపై ఆధారపడటాన్ని తగ్గించి, స్వదేశీ తయారీని ప్రోత్సహించేలా ప్రభుత్వం భారీ నిధులను కేటాయించింది. ఆటో రంగానికి ఇచ్చే పీఎల్ఐ పథకం బడ్జెట్‌ను ఏకంగా 111 శాతం పెంచి రూ.5,939 కోట్లకు చేర్చడం గమనార్హం. ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అత్యంత కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ కోసం ప్రభుత్వం కొత్తగా నాలుగు ప్రత్యేక కారిడార్లను ప్రకటించింది. ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో ఇవి ఏర్పాటు కానున్నాయి. ప్రస్తుతం ఈ ఖనిజాల కోసం భారత్ ఎక్కువగా చైనాపై ఆధారపడుతోంది. అయితే చైనా ఇటీవల ఎగుమతులపై ఆంక్షలు విధిస్తుండటంతో, భారత్ తన సొంత సరఫరా గొలుసును బలోపేతం చేసుకోవాలని నిర్ణయించింది. ఈ కారిడార్ల ద్వారా ముడి పదార్థాల సేకరణ సులభతరమై, ఈవీల ధరలు తగ్గే అవకాశం ఉంది.
లిథియం-అయాన్ కణాల తయారీకి అవసరమైన యంత్రాల దిగుమతిపై జీరో కస్టమ్స్ డ్యూటీని ప్రభుత్వం పొడిగించింది. అలాగే, దిగుమతి చేసుకునే సెల్స్‌పై ఉన్న 5 శాతం రాయితీ పన్నును కూడా కొనసాగించింది. ఇది దేశీయ ఈవీ కంపెనీలకు పెద్ద ఊరట. ప్రస్తుతం దేశంలో అమ్ముడవుతున్న ఈవీల ధరలో బ్యాటరీల వాటా దాదాపు మూడో వంతు ఉంటుంది. చైనా త్వరలో ఎగుమతి సబ్సిడీలను తొలగించబోతున్న తరుణంలో, ఈ రాయితీలు మన దేశంలో ఈవీల ధరలు పెరగకుండా అడ్డుకుంటాయి.
ప్రస్తుతం భారత్ తన లిథియం సెల్స్ అవసరాల కోసం 75 శాతం పైగా చైనాపైనే ఆధారపడుతోంది. ప్యానసోనిక్, ఎల్‌జీ వంటి కంపెనీలు ఉన్నప్పటికీ, చైనాకు చెందిన బియాడ్, క్యాటల్ సంస్థలదే హవా. అయితే, భారతీయ దిగ్గజాలు ఓలా ఎలక్ట్రిక్, రిలయన్స్, టాటా అగ్రాటాస్, అమర రాజా, ఎక్సైడ్ సంస్థలు రంగంలోకి దిగాయి. 2030 నాటికి దేశంలో 100 GWh కంటే ఎక్కువ సామర్థ్యం గల గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేస్తామని ఇవి వాగ్దానం చేశాయి. ప్రస్తుతానికి ఓలా ఎలక్ట్రిక్ మాత్రమే కొంత మేర స్వదేశీ సెల్స్‌ను ఉత్పత్తి చేస్తోంది.
సింపుల్ ఎనర్జీ సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, "ఈ బడ్జెట్ తయారీ రంగంలో భారత్ స్వయం సమృద్ధిని కోరుకుంటున్నట్లు స్పష్టం చేస్తోంది" అని అన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ఏర్పాటు కాబోయే కారిడార్లు పారిశ్రామిక సరఫరా గొలుసులో ఉన్న అతిపెద్ద లోపాన్ని సరిచేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైటెక్ టూల్ రూమ్‌ల స్థాపన, కంటైనర్ల తయారీకి మద్దతు వంటి చర్యలు ఎగుమతులను కూడా సులభతరం చేస్తాయి. మొత్తానికి ఈ నిర్ణయాలు చైనా గుత్తాధిపత్యానికి గట్టి దెబ్బ అని చెప్పవచ్చు.