BMW : తొలిసారిగా అగ్రస్థానంలో నిలిచిన BMW.. వాహన్ డేటాలో బయటపడ్డ ఆసక్తికర విషయాలు
ఆసక్తికర విషయాలు
BMW : భారతదేశ లగ్జరీ కార్ల మార్కెట్లో ఎన్నడూ లేని విధంగా ఒక భారీ సంచలనం నమోదైంది. ఇన్నాళ్లూ లగ్జరీ కార్ల విభాగంలో రారాజుగా వెలిగిన మెర్సిడెస్ బెంజ్ సంస్థకు గట్టి షాక్ తగిలింది. ఈ ఏడాది 2026 తొలి అర్ధభాగంలో (జనవరి నుంచి జూన్ వరకు) బిఎమ్‌డబ్ల్యూ కంపెనీ అద్భుతమైన విక్రయాలతో మెర్సిడెస్‌ను అధిగమించి, భారతదేశంలోనే అత్యంత పెద్ద లగ్జరీ కార్ల బ్రాండ్‌గా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ అధికారిక వాహన్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. ఈ ఆరు నెలల కాలంలో బిఎమ్‌డబ్ల్యూ తన అనుబంధ బ్రాండ్ మినీతో కలిపి మొత్తం 10,043 లగ్జరీ వాహనాలను రిజిస్టర్ చేసింది. ఇదే సమయంలో మెర్సిడెస్ బెంజ్ పేరు మీద 9,472 వాహనాలు మాత్రమే రిజిస్టర్ అయ్యాయి.
గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే ఈసారి బిఎమ్‌డబ్ల్యూ కార్ల రిజిస్ట్రేషన్లు ఏకంగా 15 శాతం మేర భారీ వృద్ధిని సాధించాయి. మొత్తం దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్ సగటు వృద్ధి కేవలం 4 శాతంగానే నమోదైనప్పటికీ, బిఎమ్‌డబ్ల్యూ మాత్రం ఊహించని స్పీడుతో దూసుకుపోయింది. ఇదే సమయంలో మెర్సిడెస్ బెంజ్ వాహనాల రిజిస్ట్రేషన్లు మాత్రం 3 శాతం మేర క్షీణించాయి. దీనివల్ల భారత లగ్జరీ కార్ల మార్కెట్లో బిఎమ్‌డబ్ల్యూ వాటా 38 శాతానికి పెరగ్గా, మెర్సిడెస్ బెంజ్ మార్కెట్ వాటా 35 శాతానికి పడిపోయింది. అయితే, షోరూమ్‌ల ద్వారా కస్టమర్లకు నేరుగా జరిగిన వాస్తవ డెలివరీల విషయానికి వస్తే మెర్సిడెస్ బెంజ్ 9,768 కార్లతో ఇప్పటికీ ముందంజలోనే ఉంది. మరోవైపు బిఎమ్‌డబ్ల్యూ 8,571 కార్లను, మినీ బ్రాండ్ 504 కార్లను కస్టమర్లకు అందజేశాయి.
బిఎమ్‌డబ్ల్యూ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై ఆ కంపెనీ ప్రెసిడెంట్ సీఈఓ హరదీప్ సింగ్ బ్రార్ స్పందిస్తూ కీలక విషయాలు వెల్లడించారు. ఈ సక్సెస్ వెనుక నాలుగు ప్రధాన కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. కంపెనీ అనుసరించిన సరికొత్త ఎలక్ట్రిక్ వాహన వ్యూహం, దేశంలోని కొత్త నగరాలకు నెట్‌వర్క్‌ను విస్తరించడం, లాంగ్ వీల్‌బేస్ మోడల్స్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టడం, కస్టమర్లకు మెరుగైన అనుభవాన్ని అందించడం వల్లే ఇది సాధ్యమైందని వివరించారు. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లోనే కంపెనీ 11 కొత్త మోడళ్లను మార్కెట్లోకి తెచ్చిందని, రాబోయే వచ్చే ఆరు నెలల్లో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ విభాగాలలో మరో 14 సరికొత్త సెడాన్, ఎస్‌యూవీ కార్లను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.
బిఎమ్‌డబ్ల్యూ సాధించిన ఈ భారీ విజయానికి ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ ప్రధాన ఇంజన్‌గా నిలిచాయి. గత ఏడాది కంపెనీ మొత్తం అమ్మకాల్లో ఈవీల వాటా 21 శాతంగా ఉండగా, ఇప్పుడు అది ఏకంగా 26 శాతానికి పెరిగింది. అంటే ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న ప్రతి నాలుగు బిఎమ్‌డబ్ల్యూ కార్లలో ఒకటి కచ్చితంగా ఎలక్ట్రిక్ కారే కావడం విశేషం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 నగరాల్లో 100 సేల్స్ పాయింట్లను కలిగి ఉన్న ఈ సంస్థ, ఈ ఏడాది మరో 18 నగరాల్లో 19 కొత్త షోరూమ్‌లను తెరవాలని ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగానే బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ స్మాల్ కార్ బ్రాండ్ మినీ విక్రయాలు కూడా 70 శాతం పెరిగి 504 యూనిట్లకు చేరుకున్నాయి.
పెద్ద కార్ల విభాగమైన ఎస్‌యూవీ మార్కెట్లో కూడా బిఎమ్‌డబ్ల్యూ తన హవాను చాటుకుంది. ఈ ఆరు నెలల్లో కంపెనీ 5,926 ఎస్‌యూవీ మోడళ్లను విక్రయించింది, ఇది వార్షిక ప్రాతిపదికన 35 శాతం వృద్ధిని సూచిస్తుంది. కంపెనీ మొత్తం సేల్స్‌లో ఎస్‌యూవీల వాటానే 65 శాతంగా ఉంది. వీటితో పాటు కస్టమర్లకు లగ్జరీ కంఫర్ట్ ఇచ్చే బిఎమ్‌డబ్ల్యూ 5 సిరీస్ లాంగ్ వీల్‌బేస్ మోడల్ హాట్ కేకుల్లా అమ్ముడవుతోంది. ఈ ఒక్క మోడల్ నుండే ఏడాది మొదటి భాగంలో 1,200 కంటే ఎక్కువ కార్లు అమ్ముడయ్యాయి. దీన్ని బట్టి చూస్తే భారతీయ లగ్జరీ కార్ల కొనుగోలుదారులు ఇప్పుడు ఎక్కువ స్థలం, సౌకర్యం, అత్యాధునిక ఎలక్ట్రిక్ టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లు ఉన్న కార్లకే జై కొడుతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది.