BYD Ti 7 SUV:ల్యాండ్ రోవర్ డిఫెండర్‌ను కాపీ కొట్టిన చైనీస్ కంపెనీ.. కోర్టు మెట్లు ఎక్కిన జాగ్వార్
కోర్టు మెట్లు ఎక్కిన జాగ్వార్
BYD Ti 7 SUV: ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థల మధ్య డిజైన్ కాపీ కొట్టే వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రపంచంలోనే అత్యధికంగా ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే చైనా దిగ్గజం బివైడి సంస్థపై బ్రిటిష్ లగ్జరీ కార్ల బ్రాండ్ జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) తీవ్ర ఆరోపణలు గుప్పించింది. బివైడి తయారు చేసిన తాజా ఎస్యూవీ Ti 7 మోడల్ లుక్ అచ్చం తమ ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 కారును పోలి ఉందని జెఎల్ఆర్ ఆరోపించింది. ఈ కాపీ వివాదం ముదరడంతో నీదర్లాండ్స్లోని బివైడి ప్రధాన కార్యాలయాలపై అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించి సోదాలు జరపడం ఆటోమొబైల్ వర్గాల్లో సంచలనం సృష్టించింది.
బివైడి ఆఫీసులపై రైడ్స్
ది గార్డియన్ నివేదికల ప్రకారం, గతేడాది ఆగస్టు నెలలో కోర్టు నియమించిన అధికారులు నీదర్లాండ్స్లోని షిడమ్, హాఫ్డార్ప్ ప్రాంతాలలో ఉన్న బివైడి ఆఫీసులలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల సమయంలో కంపెనీకి చెందిన కీలక పత్రాలతో పాటు కొన్ని డిజిటల్ రికార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జాగ్వార్ ల్యాండ్ రోవర్ పెట్టిన లీగల్ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగానే ఈ కఠిన చర్యలు తీసుకున్నారు.
రివర్స్ ఇంజనీరింగ్ ద్వారా డిజైన్ చోరీ
బివైడి సంస్థ ఒరిజినల్ ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును పూర్తిగా విడదీసి, దాని డిజైన్ రహస్యాలను తెలుసుకుందని జెఎల్ఆర్ అనుమానిస్తోంది. రివర్స్ ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా అదే టెక్నాలజీని ఉపయోగించి Ti 7 ఎస్‌యూవీని తయారు చేశారని కంపెనీ ఆరోపిస్తోంది. అయితే తాము ఎలాంటి చట్టాలను ఉల్లంఘించలేదని, స్వాధీనం చేసుకున్న రికార్డులపై కోర్టులో వాదనలు వినిపిస్తామని బివైడి లాయర్లు స్పష్టం చేశారు. ఈ కేసులో భాగంగా నెదర్లాండ్స్‌లోని హేగ్ కోర్టులో తదుపరి విచారణ జరగనుంది.
డిఫెండర్‌ను తలపించే రూపం
చైనాలో మొదట Bao 7 పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఎస్‌యూవీని ఆ తర్వాత Ti 7గా మార్చారు. దీని బాక్సీ బాడీ షేప్, నిటారుగా ఉండే ఫ్రంట్ లుక్, చతురస్రాకారంలో ఉన్న వీల్ ఆర్చ్‌లు అచ్చం డిఫెండర్‌ను తలపిస్తాయి. ఈ ఎస్యూవీ దాదాపు 4,999 మిమీ పొడవు కలిగి ఉంది. యూరప్ మార్కెట్ కోసం ఇందులో 7-సీటర్ ఆప్షన్ అందించారు. 1.5-టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో పాటు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ మోటార్ (PHEV) సదుపాయం కూడా ఇందులో లభిస్తుంది.
తక్కువ ధరకే లగ్జరీ ఫీచర్లు అందించడమే లక్ష్యం
ఐరోపా మార్కెట్లలోకి ప్రవేశించడానికి సిద్ధమవుతున్న ఈ కారు బ్రిటన్ మార్కెట్లో సుమారు 47,995 పౌండ్ల ధరకు ప్రీ-బుకింగ్స్ జరుగుతోంది. దీని అసలు రూపమైన డిఫెండర్ 110 ధర దాదాపు 68,465 పౌండ్లుగా ఉంది. తక్కువ ధరకే లగ్జరీ డిజైన్ అందించాలనే ఉద్దేశంతోనే చైనీస్ కంపెనీలు ఇలాంటి డిజైన్లను పోలి ఉండే కార్లను తయారు చేస్తున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ జియాంగ్లింగ్ మోటార్స్ కంపెనీపై జెఎల్ఆర్ ఇలాంటి కేసు గెలవడం గమనార్హం.