Renault Kiger: కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు చాలా మంది దాని డిజైన్, మైలేజ్ చూస్తారు. కానీ అంతకంటే ముఖ్యంగా ఆటోమొబైల్ మార్కెట్లో వాహనం అందించే భద్రతా ప్రమాణాలు అత్యంత కీలకం. ఈ విషయంలో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ రెనాల్ట్ తన ప్రసిద్ధ కాంపాక్ట్ ఎస్‌యూవీ కైగర్ సేఫ్టీ ఫీచర్లను పూర్తిగా అప్‌గ్రేడ్ చేసింది. గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్వహించిన తాజా క్రాష్ టెస్ట్ ఫలితాలలో ఈ ఎస్‌యూవీ పెద్దఎత్తున మెరుగుదల కనబరుస్తూ అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో ఏకంగా 4-స్టార్ రేటింగ్‌ను దక్కించుకుంది. గతంలో ఇదే కారు కేవలం 2 స్టార్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

గతానికి ఇప్పటికి మారిన భద్రతా ప్రమాణాలు

గతంలో గ్లోబల్ ఎన్‌క్యాప్ పరీక్షలు నిర్వహించినప్పుడు రెనాల్ట్ కైగర్‌లో కేవలం రెండు ఎయిర్‌బ్యాగ్స్ మాత్రమే ఉండేవి. ఆ సమయంలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) అలాగే ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకర్స్ వంటి ప్రాథమిక భద్రతా ఫీచర్లు కూడా అందుబాటులో లేకపోవడంతో అడల్ట్ సేఫ్టీలో 2 స్టార్స్, చైల్డ్ సేఫ్టీలో కేవలం 1 స్టార్ మాత్రమే లభించింది. ఈ లోపాలను గుర్తించిన కంపెనీ వెంటనే స్పందించి కార్లలో అత్యాధునిక భద్రతా హంగులను జోడించి సరికొత్త మోడల్‌ను పరీక్షల నిమిత్తం మళ్లీ పంపింది.

స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు

తాజాగా మార్కెట్లోకి వచ్చిన అప్‌డేటెడ్ రెనాల్ట్ కైగర్‌లో కంపెనీ స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లను అమర్చింది. ఇవి కాకుండా ఈఎస్సీ, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్, పెడెస్ట్రియన్ ప్రొటెక్షన్ వంటి ఆధునిక ఫీచర్లను జతచేసింది. ఈ మార్పుల కారణంగానే క్రాష్ టెస్ట్ ఫలితాలు పూర్తిగా మారిపోయాయి. అడల్ట్ ప్రొటెక్షన్‌లో 4 స్టార్స్ రాగా, పిల్లల రక్షణ విభాగంలో ఈ కారు 3 స్టార్స్ సాధించి ప్రయాణికులకు మరింత భరోసా కల్పిస్తోంది.

సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ పనితీరు ఎలా ఉంది?

కారుపై నిర్వహించిన సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ సమయంలో ఒక డోర్ తెరుచుకోవడం వల్ల కొన్ని పాయింట్లు కోల్పోవాల్సి వచ్చింది. అయినప్పటికీ తల, పొత్తికడుపు, పెల్విస్ భాగాలకు అద్భుతమైన రక్షణ లభించిందని టెస్టింగ్ నివేదికలు స్పష్టం చేశాయి. సైడ్ పోల్ టెస్ట్‌లో ఛాతి రక్షణ కొద్దిగా పరిమితంగా ఉన్నట్లు తేలింది. చిన్నపిల్లల భద్రతకు సంబంధించి 18 నెలల డమ్మీ అద్భుతంగా రాణించగా, 3 ఏళ్ల డమ్మీ విషయంలో కొన్ని మెరుగుదలలు అవసరమని తేలింది.

పాదచారుల రక్షణ నిబంధనలు కూడా పాటిస్తున్న కైగర్

గ్లోబల్ ఎన్‌క్యాప్ నిర్దేశించిన యూఎన్127 నిబంధనల ప్రకారం రోడ్డుపై నడిచే పాదచారుల సేఫ్టీకి కూడా ఈ కారులో పెద్దపీట వేశారు. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, సీటు బెల్ట్ రిమైండర్ వంటి అన్ని నిబంధనలను ఈ అప్‌డేటెడ్ కారు విజయవంతంగా పూర్తి చేసింది. తక్కువ బడ్జెట్‌లో లభించే కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో అత్యుత్తమ భద్రతను కోరుకునే వినియోగదారులకు రెనాల్ట్ కైగర్ ఒక మంచి ఎంపికగా మారుతోంది.

Tags: