Simple Energy : ఈవీ వాహనదారులకు గుడ్ న్యూస్.. చైనాకు షాకిచ్చిన బెంగళూరు కంపెనీ
చైనాకు షాకిచ్చిన బెంగళూరు కంపెనీ
Simple Energy : సింపుల్ ఎనర్జీ ఎలక్ట్రిక్ వాహనాల టెక్నాలజీలో ఒక పెద్ద ముందడుగు వేసింది. బెంగళూరుకు చెందిన ఈ ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ దేశంలోనే మొదటి రేర్ ఎర్త్-ఫ్రీ ఈవీ మోటార్‌ను తయారు చేసింది. కొన్ని నెలల క్రితం చైనా, భారతదేశానికి రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ సరఫరాపై నిషేధం విధించడంతో ఈవీ పరిశ్రమ దాదాపుగా ఆగిపోయింది. చైనా ఈ చర్య తీసుకున్న నేపథ్యంలో సింపుల్ ఎనర్జీ భారత్‌లో తొలి ఆటో తయారీదారుగా నిలిచింది. ఈ కంపెనీ రేర్ ఎర్త్-ఫ్రీ ఎలక్ట్రిక్ మోటార్ల వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ విజయం తమ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కారణంగా సాధ్యమైందని, దీనివల్ల 95 శాతం స్వదేశీ తయారీ సాధ్యమైందని కంపెనీ పేర్కొంది.
ఈ ఘనత గురించి సింపుల్ ఎనర్జీ సీఈఓ సుహాస్ రాజ్‌కుమార్ మాట్లాడుతూ, "గ్లోబల్ సప్లై చైన్‌లో ఆటంకాలు, ముడి పదార్థాలపై ఆధారపడటం ఒక విషయాన్ని స్పష్టం చేశాయి. ఎలక్ట్రిక్ వాహనాల భవిష్యత్తు స్వావలంబనపైనే ఆధారపడి ఉంటుంది. స్వదేశీకరణ, మేక్ ఇన్ ఇండియా అనే ఆలోచన ఇప్పుడు కేవలం ఒక ఆకాంక్ష మాత్రమే కాదు, అది ఒక అవసరం" అని అన్నారు.
రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. ఈ పేటెంటెడ్ ఇన్-హౌస్ టెక్నాలజీలో భారీ రేర్ ఎర్త్ మాగ్నెట్‌లకు బదులుగా ఆప్టిమైజ్డ్ కాంపౌండ్స్‌ను ఉపయోగించారు. ఇందులో కంపెనీ సొంత అల్గారిథమ్‌లు కూడా ఉన్నాయి. ఇవి రియల్ టైంలో వేడి, టార్క్‌ను కంట్రోల్ చేస్తాయి. మోటార్ పూర్తిగా కంపెనీలోనే తయారు కావడంతో సింపుల్ ఎనర్జీ ఆర్&డీ సమయాన్ని చాలా తగ్గించగలిగింది. దీంతో, ఇతర కంపెనీల కంటే చాలా వేగంగా అడ్వాన్స్డ్ రేర్ ఎర్త్-ఫ్రీ మోటార్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది.
కొత్త రేర్ ఎర్త్-ఫ్రీ ఎలక్ట్రిక్ మోటార్‌తో పాటు, సింపుల్ ఎనర్జీ సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ జెన్ 2 పై కూడా పనిచేస్తోంది. ఇందులో జెన్ 1.5, వన్ ఎస్ (One S) మోడల్స్ కంటే అనేక అప్‌గ్రేడ్‌లు ఉంటాయని తెలిపారు. దీనితో పాటు, ఈ బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ రాబోయే 14 నుండి 16 నెలల్లో తన సొంత ఐపీఓ తీసుకురావడానికి కూడా సిద్ధమవుతోంది.