Kia Syros EV : ఒక్క ఛార్జ్ తో 370 కిమీ.. కియా సైరోస్ ఈవీ రేంజ్ మామూలుగా లేదుగా!
కియా సైరోస్ ఈవీ రేంజ్ మామూలుగా లేదుగా!
Kia Syros EV : భారతదేశ ఎలక్ట్రిక్ వాహన రంగంలో తన పట్టును మరింత బిగించేందుకు కియా మోటార్స్ సిద్ధమైంది. ఇప్పటికే మార్కెట్లో ఈవీ6, ఈవీ9 వంటి ప్రీమియం మోడళ్లతో పాటు క్యారెన్స్ ఈవీని కలిగి ఉన్న కియా, ఇప్పుడు మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా కియా సైరోస్ ఈవీని తీసుకువస్తోంది. 4 మీటర్ల కంటే తక్కువ పొడవు ఉండే ఈ కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉంది. ఇటీవల మరోసారి రోడ్లపై టెస్టింగ్ చేస్తూ కనిపించడంతో ఈ ఏడాది చివరి నాటికి ఇది మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.
కియా సైరోస్ ఈవీ బ్యాటరీ, మోటార్ గురించి కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే, ఇది హ్యుందాయ్ ఇన్‌స్టర్ ఈవీ నుంచి బ్యాటరీ ప్యాక్‌ను అప్పు తెచ్చుకునే అవకాశం ఉంది. ఇందులో 42 kWh లేదా 49 kWh బ్యాటరీ ఆప్షన్లు ఉండవచ్చు. ఇవి ఎన్ఎమ్‌సి టెక్నాలజీతో పనిచేస్తాయి, దీనివల్ల బ్యాటరీకి సుమారు 8 ఏళ్ల వారంటీ లభించే ఛాన్స్ ఉంది. పెద్ద బ్యాటరీ ప్యాక్‌తో ఒక్కసారి ఛార్జ్ చేస్తే సుమారు 370 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని అంచనా. కేవలం 30 నిమిషాల్లోనే 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అయ్యేలా ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ కూడా ఇందులో ఉండబోతోంది.
డిజైన్ విషయానికి వస్తే, ఇది చూడటానికి పెట్రోల్ వెర్షన్ సైరోస్ లాగే ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ వెర్షన్ అని గుర్తించడానికి కొన్ని మార్పులు చేస్తున్నారు. కొత్త లోగోలు, ప్రత్యేకమైన ఈవీ బ్యాడ్జింగ్, గాలిని సులువుగా చీల్చుకుపోయే ఎరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ ఇందులో ఉంటాయి. చార్జింగ్ పోర్ట్ కారు ముందు భాగంలో ఎడమ వైపున ఉండేలా డిజైన్ చేశారు. లోపల మాత్రం లగ్జరీకి తక్కువ లేకుండా 30 ఇంచుల భారీ ట్రినిటీ డిస్‌ప్లే, 360-డిగ్రీ కెమెరా, పనోరమిక్ సన్‌రూఫ్ మరియు డాష్‌క్యామ్ వంటి హైటెక్ ఫీచర్లు ఉండనున్నాయి.
టాటా పంచ్ ఈవీకి ఇది గట్టి పోటీ ఇస్తుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. దీని ధర సుమారు రూ. 10 లక్షల నుండి రూ. 15 లక్షల మధ్య ఉండవచ్చు. భద్రతకు పెద్దపీట వేస్తూ ఇందులో లెవల్-2 అడాస్ ఫీచర్లను కూడా కియా జోడిస్తోంది. తక్కువ ధరలో మంచి రేంజ్, అదిరిపోయే ఫీచర్లు కోరుకునే వారికి సైరోస్ ఈవీ ఒక బెస్ట్ ఆప్షన్ కానుంది.