Delhi EV Policy 2.0 : ఢిల్లీ ఈవీ పాలసీ ఎఫెక్ట్.. దూసుకుపోయిన ఏథర్, ఓలా షేర్లు

ఏథర్, ఓలా షేర్లు

Update: 2026-06-30 13:18 GMT

Delhi EV Policy 2.0 : ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన సరికొత్త ఎలక్ట్రిక్ వాహనాల విధానం ఈవీ పాలసీ 2.0కి ఆమోదం లభించడంతో మంగళవారం షేర్ మార్కెట్లోని ఆటోమొబైల్ రంగ షేర్లలో భారీ హల్‌చల్ కనిపించింది. ప్రభుత్వ ప్రకటనతో ఒకవైపు సాంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలను తయారు చేసే కంపెనీల షేర్లపై తీవ్ర ఒత్తిడి పెరగ్గా, మరోవైపు ఎలక్ట్రిక్ స్కూటర్లు తయారు చేసే కంపెనీల షేర్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ఈ కొత్త పాలసీ ప్రభావం దేశీయ ఆటోమొబైల్ రంగాన్ని పూర్తిగా మార్చేసేలా ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఐషర్ మోటార్స్ డౌన్.. ఏథర్, ఓలా షేర్లు అప్

ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంతో ప్రముఖ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను తయారు చేసే ఐషర్ మోటార్స్ షేర్లు మార్కెట్ ఆరంభంలో ఏకంగా 7 శాతం వరకు పడిపోయాయి. అలాగే ఆటో విడిభాగాల సంస్థ 'భారత్ ఫోర్జ్' షేర్లు కూడా 5 శాతం మేర నష్టపోయాయి. మధ్యాహ్నం సమయానికి ఇవి కొంత కోలుకున్నప్పటికీ ఐషర్ మోటార్స్ 3.5 శాతం నష్టంతోనే ట్రేడ్ అయింది. వీటికి భిన్నంగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ కంపెనీ అయిన ఏథర్ ఎనర్జీ షేరు 4% లాభపడి, చరిత్రలోనే మొదటిసారిగా రూ.1,131 రికార్డు స్థాయికి చేరింది. 2026 సంవత్సరంలోనే ఏథర్ షేరు ఇప్పటివరకు 49 శాతం లాభపడటం విశేషం. మరో ప్రముఖ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ షేరు కూడా ఏకంగా 9.3 శాతం లాభంతో దూసుకుపోయింది.

అసలు ఏంటి ఢిల్లీ ఈవీ పాలసీ 2.0?

ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించిన ఈ సరికొత్త ఈవీ పాలసీ 2.0 రాబోయే జూలై 1, 2026 నుంచి అమల్లోకి రానుంది. ఇది మార్చి 31, 2030 వరకు అమల్లో ఉంటుంది. దేశ రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించి ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యను విపరీతంగా పెంచడమే దీని ముఖ్య ఉద్దేశం. ఈ పాలసీ ప్రకారం జనవరి 1, 2027 నుండి ఢిల్లీలో కేవలం ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాలకు మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్లు చేస్తారు. అలాగే ఏప్రిల్ 1, 2028 నుండి కేవలం ఎలక్ట్రిక్ టూ-వీలర్లను మాత్రమే కొత్తగా రిజిస్టర్ చేయడానికి అనుమతి ఇస్తారు. అంటే ఆయా తేదీల తర్వాత అక్కడ కొత్త పెట్రోల్ ఆటోలు, బైకుల రిజిస్ట్రేషన్లు పూర్తిగా బంద్ కానున్నాయి.

ఈవీ కొనుగోలుపై భారీ సబ్సిడీలు

ప్రజలను ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లించేందుకు ప్రభుత్వం భారీగా సబ్సిడీ ప్రకటించింది. కొత్తగా ఎలక్ట్రిక్ టూ-వీలర్ కొనేవారికి మొదటి ఏడాది రూ.30,000, రెండో ఏడాది రూ.20,000, మూడో ఏడాది రూ.10,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. అలాగే ఎలక్ట్రిక్ ఆటో కొనేవారికి మొదటి ఏడాది రూ.50,000, రెండో ఏడాది రూ.40,000, మూడో ఏడాది రూ.30,000 వరకు ప్రభుత్వం అందిస్తుంది. వీటితో పాటు మీ పాత బీఎస్-4 లేదా అంతకంటే పాత పెట్రోల్-డీజిల్ వాహనాలను స్క్రాప్ కింద మారిస్తే రూ.లక్ష వరకు స్క్రాపింగ్ ఇన్సెంటివ్ ఇస్తారు. ఈ భారీ ప్రాజెక్ట్ కోసం ప్రభుత్వం రాబోయే నాలుగేళ్లలో రూ.15,000 కోట్లు ఖర్చు చేయనుంది.

పెట్రోల్ కార్లు, బైక్ కంపెనీలకు నష్టమేనా?

ఈ నిర్ణయం వల్ల టాటా మోటార్స్, మహీంద్రా, ఓలా ఎలక్ట్రిక్, ఏథర్ ఎనర్జీ వంటి ఈవీ రంగంలో ఉన్న కంపెనీలకు దీర్ఘకాలంలో భారీ లాభాలు వస్తాయని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఢిల్లీ తీసుకొచ్చిన ఈ మోడల్ రాబోయే రోజుల్లో ఇతర పెద్ద రాష్ట్రాలు కూడా అమలు చేస్తే దేశంలో ఈవీ విప్లవం మరింత వేగవంతం అవుతుంది. అయితే, కేవలం పెట్రోల్ బైకులపైనే ఆధారపడే రాయల్ ఎన్‌ఫీల్డ్, బజాజ్ ఆటో, టీవీఎస్ మోటార్స్ వంటి కంపెనీలపై కొంత ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉంది. కానీ, ఈ కంపెనీలు కూడా తమ ఎలక్ట్రిక్ మోడళ్లను మార్కెట్లోకి వేగంగా తీసుకువస్తే ఈ నష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Tags:    

Similar News