NHAI : గలీజు టాయిలెట్ ఫోటో తీయండి..రూ.1,000 సంపాదించండి

రూ.1,000 సంపాదించండి

Update: 2026-02-13 08:49 GMT

NHAI : నేషనల్ హైవేలపై ప్రయాణించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ప్రకటించింది. హైవేలపై ఉన్న టాయిలెట్లు గలీజుగా ఉంటే, ఆ ఫోటో తీసి పంపిస్తే చాలు.. మీ అకౌంట్‌లో 1,000 రూపాయలు జమ అవుతాయి. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా, స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సామాన్య పౌరులను భాగస్వామ్యం చేస్తూ హైవేలపై పరిశుభ్రతను పెంచడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

నేషనల్ హైవేస్ మీద ప్రయాణించేటప్పుడు మీరు ఏదైనా టోల్ ప్లాజా వద్ద లేదా హైవే పక్కన ఉన్న NHAI టాయిలెట్‌లోకి వెళ్ళినప్పుడు అది శుభ్రంగా లేకపోతే వెంటనే అలర్ట్ అవ్వండి. మీ ఫోన్‌లో Rajmargyatra యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ యాప్ ద్వారా సదరు గలీజు టాయిలెట్ ఫోటో తీసి అప్‌లోడ్ చేయాలి. మీ పేరు, కారు నెంబర్ (VRN), మొబైల్ నెంబర్, ఆ ప్రదేశం పేరు నమోదు చేస్తే సరిపోతుంది. మీ ఫిర్యాదు నిజమని తేలితే, మీ ఫాస్టాగ్ అకౌంట్‌లో రూ.1,000 రీఛార్జ్ అవుతుంది.

ఈ ఛాలెంజ్ జూన్ 30, 2026 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. అయితే ఇక్కడ కొన్ని కండిషన్లు ఉన్నాయి. మీరు పంపే ఫోటో ఖచ్చితంగా Rajmargyatra యాప్ ద్వారానే తీయాలి. అందులో లొకేషన్ వివరాలు (Geo-tag), టైమ్ స్టాంప్ ఉండాలి. ఆ టాయిలెట్ NHAI నిర్వహించేదై ఉండాలి. ప్రైవేట్ హోటళ్లు, దాబాలు లేదా పెట్రోల్ పంపుల్లో ఉండే టాయిలెట్లు ఈ పథకం కిందకు రావు.

ఒక టాయిలెట్ గురించి ఒక రోజులో కేవలం ఒకరికి మాత్రమే రివార్డ్ ఇస్తారు. అంటే ఒక టాయిలెట్ గలీజుగా ఉందని పది మంది ఫోటోలు తీసి పంపినా.. ఎవరైతే అందరికంటే ముందుగా అప్‌లోడ్ చేస్తారో వారికే ఆ వెయ్యి రూపాయల ప్రైజ్ మనీ అందుతుంది. అధికారులు, AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ద్వారా ఈ ఫోటోలను తనిఖీ చేస్తారు. ఒకవేళ మీరు పాత ఫోటోలు లేదా ఫేక్ ఫోటోలు పంపితే రిజెక్ట్ చేస్తారు.

ఈ పథకంలో వచ్చే వెయ్యి రూపాయలను మీరు నగదు రూపంలో డ్రా చేసుకోవడానికి వీలుండదు. ఇది కేవలం మీ వాహనానికి ఉన్న FASTag అకౌంట్‌లోకి క్రెడిట్ అవుతుంది. దీనివల్ల మీరు తదుపరి ప్రయాణాల్లో టోల్ ఫీజు చెల్లించడానికి ఈ అమౌంట్‌ను వాడుకోవచ్చు. ఫిర్యాదు అందిన వెంటనే సంబంధిత టోల్ ప్లాజా మేనేజ్‌మెంట్‌పై చర్యలు తీసుకుని, టాయిలెట్‌ను శుభ్రం చేయిస్తారు.

Tags:    

Similar News