Ducati DesertX V2: రూ.20 లక్షలకు చేరువలో డుకాటీ బైక్.. 110 hp పవర్‌తో డిజర్ట్X V2
| 110 hp పవర్‌తో డిజర్ట్X V2
Ducati DesertX V2: అడ్వెంచర్ బైక్ ప్రియుల కోసం డుకాటీ కొత్త డిజర్ట్X V2ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇది రెండో తరం మోడల్. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.19.99 లక్షలుగా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా డుకాటీ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. డిసెంబర్ మొదటి వారంలో డెలివరీలు మొదలుకానున్నాయి. ఈ బైక్ మ్యాట్ స్టార్ వైట్ సిల్క్ అనే ఒకే రంగులో అందుబాటులో ఉంటుంది. కొత్త ఇంజిన్, మారిన ఛాసిస్, మెరుగైన సస్పెన్షన్‌తో పాత మోడల్‌తో పోలిస్తే పలు మార్పులు చేశారు.
890cc ఇంజిన్.. 110 hp పవర్
ఈ బైక్‌లో కొత్త 890cc V2 ట్విన్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు. ఇది 9,000 ఆర్పీఎం వద్ద 110 hp పవర్, 7,000 ఆర్పీఎం వద్ద 92Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 3,000 ఆర్పీఎం వద్దే గరిష్ఠ టార్క్‌లో 70 శాతం అందుబాటులోకి వస్తుందని కంపెనీ చెబుతోంది. ఇందులో IVT వేరియబుల్ ఇన్‌టేక్ వాల్వ్ టైమింగ్ టెక్నాలజీ ఉంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌లో మొదటి నాలుగు గేర్లను ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు అనుకూలంగా రూపొందించారు. హైవేపై సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఆరో గేర్‌ను పొడవుగా ఉంచారు.
ఆరు రైడింగ్ మోడ్స్.. అధునాతన భద్రతా ఫీచర్లు
డిజర్ట్X V2లో 6-యాక్సిస్ IMU వ్యవస్థ ఉంది. ఇది కార్నరింగ్ ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్, వీలీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి ఫీచర్లకు సపోర్ట్ చేస్తుంది. స్పోర్ట్, టూరింగ్, అర్బన్, వెట్, ఎండ్యూరో, ర్యాలీ.. ఇలా ఆరు రైడింగ్ మోడ్స్ అందించారు. ఎండ్యూరో, ర్యాలీ మోడ్స్‌లో ఏబీఎస్ను పూర్తిగా ఆఫ్ చేసుకునే అవకాశం ఉంది. డుకాటీ క్విక్ షిఫ్ట్ 2.0, క్రూయిజ్ కంట్రోల్, 5 అంగుళాల కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్ కూడా ఉన్నాయి. నావిగేషన్, మల్టీమీడియా సిస్టమ్ కోసం అదనపు సదుపాయాలు అందుబాటులో ఉంటాయి.
ఆఫ్‌రోడ్ ప్రయాణాలకు ప్రత్యేకంగా..
ఈ బైక్‌లో అల్యూమినియం మోనోకాక్ ఫ్రేమ్ ఇచ్చారు. ముందు 46mm KYB అప్‌సైడ్ డౌన్ ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. ముందు చక్రం 21 అంగుళాలు, వెనుక చక్రం 18 అంగుళాలుగా ఉంటుంది. రెండింటికీ ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్ ఇచ్చారు. ముందు సస్పెన్షన్ ట్రావెల్ 230mm, వెనుక 220mm. సీటు ఎత్తు 880mm, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 18 లీటర్లు. ఇంధనం మినహా బైక్ బరువు 209 కిలోలు. అదనపు ఫ్యూయల్ ట్యాంక్, రేడియేటర్ గార్డ్, అల్యూమినియం ప్యానియర్స్, హార్డ్‌వేర్, లగేజ్ కిట్ వంటి యాక్సెసరీలను కూడా కొనుగోలు చేయవచ్చు.