E20 Petrol : వాహనదారులకు అలర్ట్.. E20 పెట్రోల్‌తో మైలేజ్ తగ్గుతోందా? అసలు నిజం ఇదీ
అసలు నిజం ఇదీ
E20 Petrol : ప్రస్తుతం దేశవ్యాప్తంగా వాహనదారుల మధ్య E20 పెట్రోల్ గురించిన చర్చ జోరుగా సాగుతోంది. సోషల్ మీడియాలో చాలా మంది వాహనదారులు ఈ కొత్త రకం పెట్రోల్ వాడినప్పటి నుంచి తమ బైక్‌లు, కార్ల మైలేజ్ గణనీయంగా తగ్గిపోతోందని, ఇంజన్లలో సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం, ఆటోమొబైల్ కంపెనీలు మాత్రం E20 పెట్రోల్ వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం వాటిల్లదని స్పష్టం చేస్తున్నాయి. అయితే, 2023 కంటే ముందు తయారైన పాత వాహనాలలో ఈ ఇంధనం వల్ల మైలేజ్ స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం అంగీకరించింది. ఈ మైలేజ్ తగ్గుదల అనేది కూడా రోడ్డు పరిస్థితులు, డ్రైవింగ్ చేసే విధానంపై ఆధారపడి ఉంటుందని పేర్కొంది.
మైలేజ్ 3 నుంచి 5 శాతం తగ్గే అవకాశం
పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ను మిక్స్ చేసి తయారు చేసే ఈ E20 ఇంధనం వల్ల కొన్ని రకాల వాహనాలలో మైలేజ్ 3 శాతం నుంచి 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే మైలేజ్ పరంగా కొద్దిగా నష్టం వచ్చినప్పటికీ, దీనివల్ల దేశానికి, పర్యావరణానికి జరిగే మేలు చాలా ఎక్కువని ప్రభుత్వం వివరిస్తోంది. E20 పెట్రోల్ వల్ల ఇంజన్ పనితీరు మెరుగ్గా ఉంటుందని, వాహనాల నుంచి వచ్చే కాలుష్యం భారీగా తగ్గుతుందని స్పష్టం చేసింది. అంతేకాకుండా, విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకోవడం తగ్గి, దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వం అంటుంది.
ఈ20 ఇంధనంతో ఏడాదికి ఎంత ఖర్చు పెరుగుతుంది?
మైలేజ్ కేవలం 3 నుంచి 5 శాతం తగ్గడం అనేది పైకి చిన్న విషయంగానే అనిపించవచ్చు. కానీ, లాంగ్ రన్‌లో చూస్తే దీనివల్ల మీ జేబుపై పడే భారం కాస్త పెద్దదిగానే ఉంటుంది. ఒకవేళ మీ కారు మైలేజ్ గనుక 5 శాతం తగ్గితే.. ఏడాది కాలంలో మీ పెట్రోల్ ఖర్చు ఎంత పెరుగుతుందో ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకుందాం.
పెట్రోల్ వినియోగం ఎలా పెరుగుతుందంటే:
మీరు మీ కారును ప్రతిరోజూ సగటున 50 కిలోమీటర్లు తిప్పుతారని అనుకుందాం. అంటే ఒక సంవత్సరంలో మీ కారు మొత్తం 18,250 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఒకవేళ మీ కారు సాధారణ పెట్రోల్‌పై లీటరుకు 20 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తే.. ఆ దూరాన్ని దాటడానికి మీకు సంవత్సరానికి సుమారు 913 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది.
ఇప్పుడు E20 పెట్రోల్ వాడటం వల్ల మీ కారు మైలేజ్ 5 శాతం తగ్గి, లీటరుకు 19 కిలోమీటర్లకు పడిపోయిందని అనుకుందాం. అప్పుడు అదే 18,250 కిలోమీటర్ల దూరాన్ని పూర్తి చేయడానికి మీకు దాదాపు 961 లీటర్ల పెట్రోల్ అవసరమవుతుంది. అంటే సాధారణం కంటే ఒక ఏడాదికి దాదాపు 48 లీటర్ల పెట్రోల్ ఎక్కువగా ఖర్చవుతుంది.
సంవత్సరానికి ఎంత అదనపు భారం పడుతుందంటే?
ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధరను సగటున రూ.100 గా లెక్క వేసుకుంటే.. మైలేజీలో వచ్చిన ఈ 5 శాతం మార్పు వల్ల మీరు ఏడాదికి దాదాపు రూ.4,800 వరకు అదనంగా జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒకవేళ మీ నగరంలో పెట్రోల్ ధర గనుక రూ.100 కంటే ఎక్కువగా ఉంటే, ఈ అదనపు భారం మరింత పెరుగుతుంది.
అయితే ఈ లెక్కలు కేవలం అవగాహన కోసం 5 శాతం మైలేజ్ తగ్గుదల ఆధారంగా వేసినవి మాత్రమే. ప్రతి కారులోనూ మైలేజ్ ఒకేలా తగ్గాలని లేదు. ఆటోమొబైల్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కారు మైలేజ్ అనేది కేవలం పెట్రోల్ మీదే కాకుండా వాహనం కండిషన్, రోడ్లపై ఉండే ట్రాఫిక్, ఏసీ వినియోగం, టైర్లలోని ఎయిర్ ప్రెజర్, డ్రైవింగ్ స్టైల్‌పై కూడా భారీగా ఆధారపడి ఉంటుంది. కాబట్టి మైలేజ్ తగ్గడానికి కేవలం E20 పెట్రోల్‌ను మాత్రమే కారణంగా చూపలేమని నిపుణులు చెబుతున్నారు.