Car Buying Tips: దీపావళి పండుగ సీజన్ వస్తే చాలు ఆటోమొబైల్ మార్కెట్లో భారీ డిస్కౌంట్లు, ఆకర్షణీయమైన ఆఫర్ల హోరు మొదలవుతుంది. కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేయాలని భావించే వారికి కంపెనీలు రకరకాల రాయితీలను ప్రకటిస్తుంటాయి. అయితే కేవలం పెద్ద మొత్తంలో డిస్కౌంట్ ఇస్తున్నారన్న ఉత్సాహంతో ఎలాంటి ఆలోచన లేకుండా వాహనం కొనుగోలు చేయడం సరికాదు. షోరూమ్‌లలో ఇన్సూరెన్స్, యాక్సెసరీలు, లోన్ ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో కస్టమర్ల నుంచి అదనంగా పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేస్తుంటారు. కాబట్టి పండుగ వేళ వాహనం కొనే ముందు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం.

వేర్వేరు డీలర్‌షిప్‌లలో ధరలను సరిపోల్చండి

మీరు నష్టపోకుండా ఉండాలంటే ఒకే మోడల్ కారు లేదా బైక్ ధరను కనీసం మూడు వేర్వేరు డీలర్‌షిప్‌ల వద్ద విచారించడం మంచిది. అన్ని షోరూమ్‌ల నుంచి రాతపూర్వక ఆన్-రోడ్ ధర కోటేషన్‌ను తీసుకోవాలి. ఇందులో ఎక్స్ షోరూం ధర, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ఖర్చులు స్పష్టంగా ఉండాలి. ఒక డీలర్ రూ. 50 వేలు డిస్కౌంట్ ఇస్తే, మరో డీలర్ రూ. 65 వేలు ఇవ్వవచ్చు. అయితే ఎక్కువ డిస్కౌంట్ ఇచ్చే వారు ఇతర ఛార్జీలను పెంచడం ద్వారా ఆ మొత్తాన్ని రాబట్టుకుంటున్నారా లేదా అనేది కచ్చితంగా గమనించాలి.

ఇన్సూరెన్స్, లోన్ ఆప్షన్ల మధ్య పోలిక

షోరూమ్ వారు చెప్పిన చోటే ఇన్సూరెన్స్ తీసుకోవాలనే నిబంధన ఏమీ లేదు. మార్కెట్లో లభించే ఇతర బీమా కంపెనీల ప్రీమియం ధరలు, సర్వీసులను పోల్చి చూసి మెరుగైన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. పండుగ వేళ బీమాపై ప్రత్యేక రాయితీలు లభించే అవకాశం ఉంది. అలాగే కార్ లేదా బైక్ లోన్ కోసం వివిధ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు, ప్రాసెసింగ్ ఫీజులను బేరీజు వేసుకోవాలి. తక్కువ వడ్డీ లభించే బ్యాంకును ఎంచుకోవడం ద్వారా దీర్ఘకాలంలో వందల వేల రూపాయలను ఆదా చేసుకోవడం సాధ్యమవుతుంది.

అనవసరమైన యాక్సెసరీల కొనుగోళ్లకు నో చెప్పండి

చాలా డీలర్‌షిప్‌లు కార్లతో పాటు సీట్ కవర్లు, ఫ్లోర్ మ్యాట్లు, మడ్ ఫ్లాప్‌లు, డోర్ వైజర్లు వంటి యాక్సెసరీల ప్యాకేజీలను బలవంతంగా అంటగట్టాలని చూస్తుంటాయి. వీటి వల్ల కారు అసలు ధరకు అదనంగా రూ. 20 వేల నుంచి రూ. 35 వేల వరకు భారం పడుతుంది. కాబట్టి యాక్సెసరీలు కొనేటప్పుడు ప్రతి వస్తువు ధరను విడివిడిగా అడిగి తెలుసుకోవాలి. ఏది అవసరమో దానిని మాత్రమే ఎంచుకుని, మిగతా వాటిని సున్నితంగా తిరస్కరించడం ద్వారా అనవసర ఖర్చులను సులభంగా తగ్గించుకోవచ్చు.

డెలివరీకి ముందు వాహన తనిఖీ, డాక్యుమెంట్లు

కొత్త కారు లేదా బైక్ డెలివరీ తీసుకునే సమయంలో ఎలాంటి తొందరపాటు ప్రదర్శించకూడదు. పగటి పూట వెలుతురులో వాహనాన్ని పూర్తిగా పరిశీలించి ఏవైనా గీతలు, డెంట్లు ఉన్నాయేమో చూసుకోవాలి. ఓడోమీటర్, హెడ్‌లైట్లు, మ్యూజిక్ సిస్టమ్ సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో చెక్ చేయాలి. ఇన్వాయిస్, ఇన్సూరెన్స్ పాలసీ, ఓనర్ మాన్యువల్, వారంటీ డాక్యుమెంట్లను సరిచూసుకోవడం ముఖ్యం. డీలర్ వాగ్దానం చేసిన అన్ని ఫీచర్లు బిల్లులో ఉన్నాయో లేదో నిర్ధారించుకున్న తర్వాతే బండిని ఇంటికి తీసుకెళ్లాలి.

Tags: