TVS Apache: టీవీఎస్ నుంచి సరికొత్త అపాచీ బైక్.. EICMA షోలో అదరగొట్టిన ఆర్టీఆర్ 125 ఎల్‌సి
ఆర్టీఆర్ 125 ఎల్‌సి
TVS Apache: భారతీయ ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి తన సత్తా చాటింది. ఇటలీలోని మిలాన్ నగరంలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న EICMA 2026 మోటార్ సైకిల్ షోకి ముందే కంపెనీ తన సరికొత్త అపాచీ ఆర్టీఆర్ 125 ఎల్‌సి బైక్‌ను అధికారికంగా ప్రపంచానికి పరిచయం చేసింది. ముఖ్యంగా ఐరోపా దేశాలలోని యువ రైడర్లను, కొత్త బైక్ ప్రేమికులను దృష్టిలో ఉంచుకుని ఈ పర్ఫార్మెన్స్ మోటార్ సైకిల్‌ను అద్భుతమైన హంగులతో తీర్చిదిద్దారు.
శక్తివంతమైన 125 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్
ఈ బైక్‌లో సరికొత్త 125 సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది సుమారు 14.9 పియస్ పవర్ అలాగే 12 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి జతగా 6-స్పీడ్ గేర్‌బాక్స్ తో పాటు అసిస్ట్-అండ్-స్లిప్పర్ క్లచ్ సదుపాయాన్ని కల్పించారు. రైడర్లు తమ అవసరాలకు తగినట్లుగా బైక్ పనితీరును మార్చుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన రైడింగ్ మోడ్స్‌ను కూడా ఇందులో పొందుపరిచారు. తక్కువ సీసీ అయినప్పటికీ స్పోర్ట్స్ బైక్ అనుభూతిని పంచేలా దీని ఇంజిన్ పనితీరు ఉంటుందని కంపెనీ చెబుతోంది.
ఆకట్టుకునే స్ట్రీట్‌ఫైటర్ డిజైన్ అలాగే ఎల్ఈడీ లైటింగ్
అపాచీ 125 ఎల్‌సి డిజైన్ విషయానికి వస్తే అగ్రెసివ్ స్ట్రీట్‌ఫైటర్ లుక్‌తో ఇది కనిపిస్తుంది. మస్క్యులర్ ఫ్యూయల్ ట్యాంక్, షార్ప్ ట్యాంక్ ఎక్స్‌టెన్షన్లు, ట్రిల్లిస్ ఫ్రేమ్ దీనికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సిల్వర్ కలర్‌తో పాటు ఫ్లోరోసెంట్ ఎల్లో హైలైట్స్ బైక్ లుక్‌ను మరింత పెంచాయి. ముందు భాగంలో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, డీఆర్‌ఎల్‌తో పాటు వెనుక వైపు ట్రై-స్ప్లిట్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఇచ్చారు. కాంపాక్ట్ ఎగ్జాస్ట్, స్ప్లిట్ సీట్, వెడల్పాటి హ్యాండిల్‌బార్ సిటీ రైడింగ్‌తో పాటు లాంగ్ రైడ్స్‌కు అనుకూలంగా ఉంటాయి.
కేవైబీ యూఎస్‌డీ ఫోర్కులు అలాగే అడ్వాన్స్‌డ్ బ్రేకింగ్
రైడింగ్ సౌకర్యం కోసం ముందు భాగంలో 41 ఎంఎం కేవైబీ యూఎస్‌డీ ఫోర్కులు, వెనుక వైపు అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్‌ను అందించారు. టీవీఎస్ సింక్రో స్టిఫ్ ఛాసిస్ దీనికి అదనపు బలాన్ని ఇస్తుంది. భద్రతా ప్రమాణాల పరంగా ముందు 300 ఎంఎం, వెనుక 240 ఎంఎం డిస్క్ బ్రేకులతో పాటు బైబ్రే కాలిపర్లు ఇచ్చారు. ఇందులో డ్యూయల్-చానెల్ ఏబీఎస్ సదుపాయం కూడా ఉంది. 17 అంగుళాల అల్లాయ్ వీల్స్‌పై నడిచే ఈ బైక్‌లో వెడల్పాటి రేడియల్ టైర్లను అమర్చడం ద్వారా రోడ్డుపై మంచి గ్రిప్ లభిస్తుంది.
5-అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే
ఈ బైక్‌లో ఆధునిక ఫీచర్ల కోసమే ప్రత్యేకంగా 5 అంగుళాల టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా బ్లూటూత్ కనెక్టివిటీ, ఫుల్-స్క్రీన్ మ్యాప్ మిర్రరింగ్, టర్న్-బై-టర్న్ నావిగేషన్ సదుపాయాన్ని పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఈ బైక్‌ను కేవలం యూరోపియన్ మార్కెట్ టార్గెట్‌గా మాత్రమే ప్రవేశపెట్టారు. భారత్‌లో దీని లాంచ్ మరియు ధర గురించిన అధికారిక ప్రకటనను టీవీఎస్ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.