Yamaha: కేటీఎం బైక్‌కు గట్టి పోటీ.. యమహా నుంచి సరికొత్త అడ్వెంచర్ బైక్
సరికొత్త అడ్వెంచర్ బైక్
Yamaha: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ యమహా ఆటోమొబైల్ మార్కెట్లో మరో సంచలనానికి తెరతీసింది. ఇటలీలోని మిలాన్ వేదికగా జరగనున్న EICMA 2026 షోకి ముందుగా కంపెనీ తన సరికొత్త టెనెరే 4 కాన్సెప్ట్ అడ్వెంచర్ మోటార్ సైకిల్‌ను అధికారికంగా ప్రదర్శించింది. టెనెరే సిరీస్‌లో ఎంట్రీ-లెవల్ మోడల్‌గా రానున్న ఈ బైక్‌లో దాదాపు 400 సీసీ సామర్థ్యం గల ఇంజిన్‌ను అమర్చవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ బైక్ మార్కెట్లోకి వస్తే ప్రముఖ కేటీఎం అడ్వెంచర్ బైక్‌లకు గట్టి పోటీ ఎదురుకానుంది.
400 సీసీ శక్తివంతమైన ఇంజిన్ అంచనాలు
యమహా టెనెరే సిరీస్ అనగానే ఆఫ్-రోడింగ్, లాంగ్ రైడ్స్ బైక్‌లు గుర్తుకువస్తాయి. ఈ సిరీస్‌ను మరింత విస్తరించేందుకు కంపెనీ ఈ కొత్త మోడల్‌ను తీసుకువస్తోంది. బైక్ పేరులో ఉన్న 4 సంఖ్యను బట్టి ఇందులో సుమారు 400 సీసీ సింగిల్-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. పాత ఎక్స్మాక్స్ 400 స్కూటర్లో వాడిన ఇంజిన్‌కు పూర్తిగా భిన్నంగా, సరికొత్త టెక్నాలజీతో ఈ ఇంజిన్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. ఇది రైడర్లకు అద్భుతమైన పవర్‌ను అందిస్తుంది.
ఆఫ్-రోడింగ్ కోసం ప్రత్యేకమైన డిజైన్
ఈ కాన్సెప్ట్ బైక్‌ను పూర్తిగా ఆఫ్-రోడింగ్ అలాగే హైవే ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేశారు. మంచి గ్రౌండ్ క్లియరెన్స్, ముందు భాగంలో అడ్వెంచర్ బైక్‌ల పోలి ఉండే ప్రత్యేకమైన బీక్ డిజైన్, పొడవైన విండ్‌స్క్రీన్, హ్యాండ్గార్డులను ఇచ్చారు. బైక్ బరువు తక్కువగా ఉండేలా సరికొత్త లైట్‌వెయిట్ మెయిన్ ఫ్రేమ్‌ను వాడారు. ఫ్లాట్ ఫ్యూయల్ ట్యాంక్, రాలీ స్టైల్ సీటు, ఎత్తైన హ్యాండిల్‌బార్ ఉండటం వల్ల రైడర్ చాలా సౌకర్యవంతంగా కూర్చుని సుదీర్ఘ ప్రయాణాలు చేయడానికి ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది.
కేవైబీ సస్పెన్షన్ అలాగే 21 ఇంచుల వీల్స్
టెనెరే 4 కాన్సెప్ట్‌లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణ దీని సస్పెన్షన్ సిస్టమ్. ఇందులో ముందు అలాగే వెనుక వైపు కేవైబీ సస్పెన్షన్‌ను అమర్చారు. అడ్జస్టబుల్ ఫీచర్‌తో రానున్న ఈ సస్పెన్షన్ గుంతలు, రాతి మార్గాల్లోనూ ప్రయాణాన్ని సులభతరం చేస్తుంది. ఇందులో ముందు 21 అంగుళాలు, వెనుక 18 అంగుళాల వైర్-స్పోక్ వీల్స్‌ను ఇచ్చారు. దీనికి మిచెలిన్ అనకీ వైల్డ్ ఆఫ్-రోడ్ టైర్లను తొడిగారు. అలాగే వెనుక వైపు బాక్స్-సెక్షన్ స్వింగ్ఆర్మ్, అక్రపోవిక్ బ్రాండ్ ఎగ్జాస్ట్ సిస్టమ్ దీనికి మరింత స్పోర్టీ లుక్‌ను తెచ్చిపెట్టాయి.
ఉత్పత్తి, లాంచ్ వివరాలు
ప్రస్తుతానికి దీనిని కేవలం కాన్సెప్ట్ మోడల్‌గా మాత్రమే యమహా ప్రదర్శించింది. దీని తుది ఉత్పత్తి మోడల్, అధికారిక లాంచ్ తేదీ, ధర అలాగే పూర్తి స్పెసిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మిడిల్‌వెయిట్ అడ్వెంచర్ బైక్ లవర్లకు ఈ బైక్ ఒక సరికొత్త అనుభూతిని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.