Air Taxi : గాల్లో ఎగిరే టాక్సీ వచ్చేస్తోంది.. ఎన్విడియాతో చేతులు కలిపిన భారత స్టార్టప్ ఈప్లేన్

ఎన్విడియాతో చేతులు కలిపిన భారత స్టార్టప్ ఈప్లేన్

Update: 2026-02-20 12:06 GMT

Air Taxi : ట్రాఫిక్ కష్టాలకు కాలం చెల్లే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రోడ్ల మీద గంటల తరబడి చిక్కుకుపోయే అవసరం లేకుండా, గాల్లో ఎగురుకుంటూ గమ్యస్థానానికి చేరుకునే ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ కల త్వరలోనే నిజం కాబోతోంది. చెన్నైకి చెందిన ఏరోస్పేస్ స్టార్టప్ ది ఈప్లేన్ కంపెనీ, అమెరికన్ టెక్ దిగ్గజం ఎన్విడియాతో చేతులు కలిపింది. ఈ రెండు సంస్థలు కలిసి భారత్ తొలి ఎలక్ట్రిక్ ఎయిర్ టాక్సీ e200xను అభివృద్ధి చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాయి. ఈ ఒప్పందం ప్రధానంగా టెక్నాలజీ, నైపుణ్యాన్ని పంచుకోవడంపైనే సాగుతుంది.

ఈ భాగస్వామ్యంలో భాగంగా Nvidia Omniverse అనే అడ్వాన్సుడ్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి e200x విమానానికి ఒక డిజిటల్ ట్విన్ (వర్చువల్ కాపీ)ను రూపొందిస్తారు. అంటే, అసలు విమానం ఆకాశంలోకి ఎగరకముందే, కంప్యూటర్ స్క్రీన్‌పై అది ఎలా ప్రయాణిస్తుంది? గాలి మళ్లింపులు ఎలా ఉంటాయి? సెన్సార్లు ఎలా పనిచేస్తాయి? వంటి లక్షలాది కిలోమీటర్ల ప్రయాణాన్ని వర్చువల్ ప్రపంచంలోనే పరీక్షిస్తారు. దీనివల్ల ఖర్చు తగ్గడమే కాకుండా, ప్రమాదకరమైన పరిస్థితులను (ఉదాహరణకు పిడుగులు పడటం, సెన్సార్లు ఫెయిల్ అవ్వడం) సురక్షితంగా టెస్ట్ చేసి సిస్టమ్‌ను పకడ్బందీగా తయారు చేయవచ్చు.

ఈ విమానం లోపల మెదడులా పనిచేసే కంప్యూటింగ్ వ్యవస్థ కోసం Nvidia IGX ప్లాట్‌ఫారమ్‌ను వాడుతున్నారు. ఈ స్టార్టప్ వ్యవస్థాపకుడు సత్య చక్రవర్తి మాట్లాడుతూ.. తాము కేవలం ఒక విమానాన్ని మాత్రమే కాకుండా, ఒక పూర్తిస్థాయి రవాణా వ్యవస్థను నిర్మిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. డిజిటల్ ప్రపంచంలో వేలసార్లు పరీక్షలు చేయడం వల్ల నిజమైన ప్రయాణం అత్యంత సురక్షితంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఐఐటీ మద్రాస్ నుంచి పుట్టిన ఈ స్టార్టప్, నగరాల్లో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా పెట్టుకుంది.

ప్రస్తుతం ఈ విమానానికి సంబంధించిన మొదటి ప్రోటోటైప్ సిద్ధమైపోయింది. రాబోయే కొద్ది నెలల్లో గ్రౌండ్ టెస్టింగ్ ప్రారంభం కానుంది. అనంతరం డీజీసీఏ నుంచి అవసరమైన సర్టిఫికేషన్లు పొందిన తర్వాత.. తొలుత బెంగళూరు, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల్లో ఈ సేవలను అందుబాటులోకి తేవాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ టాక్సీలు గంటకు సుమారు 160 కి.మీ వేగంతో ప్రయాణించగలవని, ఇది మన ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గిస్తుందని అంచనా.

Tags:    

Similar News